నవతెలంగాణ – హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వానికి శుభం కార్డులు పడనునన్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన మరికొన్ని గంటలను పక్కాగా ఉపయోగించుకుని ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. మీడియా వర్గాల సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ మనుగడను నిర్ధారించేవిగా మారాయనే చర్చ జోరుగా జరుగుతోంది. అందువల్ల వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించుకోవడం ద్వారా తిరిగి తమ సత్తా ఎంటో నిరూపించుకునేందుకు గులాబీ బాస్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు బస్సు యాత్ర రూపంలో రాష్ట్రమంతా చుట్టి వచ్చిన కేసీఆర్, ప్రచారానికి చివరి రోజు మాత్రం పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు బీజేపీని, కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ మీడియా సమావేశంలో ఏయే అంశాలపై మాట్లాడబోతున్నారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.