ఎస్సీ వర్గీకరణకు … మరో కమిటీ : మోడీ

నవతెలంగాణ హైదరాబాద్‌: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు.. మాదిగ విరోధులని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ‘‘ఎంతో ప్రేమతో నన్ను ఈ సభకు ఆహ్వానించారు. మందకృష్ణ నా చిన్న తమ్ముడు. ఇంత ఆత్మీయత చూపించిన మాదిగ సమాజానికి ధన్యవాదాలు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. సామాజిక న్యాయానికి మేం కట్టుబడి ఉన్నాం. స్వాతంత్ర్యం వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశారు. ఆ ప్రభుత్వాలకు, మా ప్రభుత్వానికి తేడా గమనించాలి. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. అనేది మా విధానం. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏండ్లగా పోరాటం చేస్తున్నారు. మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. పేదరిక నిర్మూలనే మా ప్రథమ ప్రాధాన్యం. న్యాయం చేస్తామని అనేక పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయి. మీరంతా వన్ లైఫ్‌. వన్‌ మిషన్‌లా పోరాటం చేస్తున్నారు. మీ బాధలు పంచుకునేందుకే నేను ఇక్కడకు వచ్చాను.
మాదిగలకు అన్యాయం జరిగిందని మేం భావిస్తున్నాం. 30 ఏండ్ల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ నిజమైన యోధుడు. అహింసా మార్గంలో ఉద్యమించిన ప్రతి ఒక్కరికీ నమస్సులు. మాదిగల ఉద్యమాన్ని గుర్తించాం.. గౌరవిస్తాం. మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మీతో కలిసి పనిచేస్తా. ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నాం. మీ పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నాం. మీ హక్కుల సాధనలో మా తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తాం. త్వరలోనే కమిటీ వేస్తాం.. మీకు న్యాయం జరిగేలా చూస్తాం. బంగారు తెలంగాణ నిర్మాణానికి కలిసి పనిచేద్దాం. మీ పోరాటానికి అండగా ఉంటానని పూర్తి భరోసా ఇస్తున్నాను అని అన్నారు.

Spread the love