నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాస్ రెడ్డి మృతిపట్ల సభ సంతాపం తెలిపింది. వారి కుటుంబానికి శాసనసభ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అలాగే పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరిశ్వర్ రెడ్డి మృతిపట్ల సభ సంతాపం తెలిపింది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతిపట్ల శాసనసభ సంతాపన్ని తెలియజేసింది. ముగ్గురు మాజీ శాసన సభ్యులకు సంతాపంగా రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు.
అనంతరం ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు-శ్వేతపత్రం’ పై స్పీకర్ అనుమతిలో ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క లఘు చర్చను ప్రారంభించారు. దానిపై బీఆర్ఎస్ నుంచి మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడాల్సి ఉంది. అయితే శ్వేతపత్రం ఇప్పుడే ఇచ్చారు కాబట్టి .. దానిపై కొంత సమయం ఇవ్వాలని హరీష్ రావు, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు కోరారు. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించడంతో సభను స్పీకర్ అరగంట వాయిదా వేశారు.