నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం) పోటీ చేస్తున్న 19 నియోజకవర్గాలలో ప్రజలు ఆదరిస్తున్నారు. గత 5 ఏండ్ల శాసనసభ అనుభవం చూసిన తర్వాత శాసనసభలో కమ్యూనిస్టుల అవసరం మరింత పెరిగింది. అందుకే సీపీఐ(ఎం) పోటీ చేస్తున్న 19 స్థానాలలో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో పోలింగ్ సమయం దగ్గరపడింది. డబ్బు, మద్యం పెద్దఎత్తున ప్రవహిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రజలు సీపీఐ(ఎం)ని ఆదరించాలని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రకమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది. కమ్యూనిస్టులు మాత్రమే శాసనసభను ప్రజా సమస్యలమీద చర్చించడానికి, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి ఒక వేదికగా వినియోగించగలరు. ఇతర పార్టీలకు ఇవి పట్టవు. స్వార్థ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలే వారికి ముఖ్యం. కమ్యూనిస్టులు లేని శాసనసభలో అధికార, ప్రతిపక్షాలన్న తేడా లేదు. పరస్పర నిందలు తప్ప ప్రజా ప్రయోజనాల గురించి పట్టించుకోలేదు. కమ్యూనిస్టులు లేని ఈ లోటును ఈ ఎన్నికల సందర్భంగా పూడ్చటం అవసరం. ఓట్ల కోసం బీజేపీ నాయకత్వం మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. కులాన్ని, మతాన్ని పాచికగా ప్రయోగిస్తున్నది. కేంద్రంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నది. రాష్ట్రంలో ఒక్క సీటులో కూడా బీజేపీ గెలవకుండా ప్రజలు విజ్ఞతను ప్రదర్శించాలని మనవి చేస్తున్నాం. బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో దానిని ఓడించగల పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నాం. కొత్తగూడెంలో సీపీఐ, పినపాకలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, శేర్‌లింగంపల్లిలో ఎంసిపిఐ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాము. మిగిలిన స్థానాలలో ఎవరిని బలపరచాలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీలు తగు నిర్ణయం తీసుకుని, ప్రజాతంత్ర, లౌకిక, సామాజిక, పోరాట శక్తులకు మద్దతు ఇస్తాయి.