ప్రచార హోరు.. ఎనిమిది రోజుల జిల్లాలో సందడే సందడి

 – ప్రజల్లోకి అన్ని పార్టీల అభ్యర్థులు
– బరిలో తిరిగి వారే
– కొత్తగా బరిలో బిఎస్పీ
 – పర్యటనల బిజీలో పలు పార్టీలు
 – నేడు జిల్లా కు కేసీఆర్
 – 22 న పేటకు రానున్న మాయావతి
 – 28న కోదాడ,హుజుర్ నగర్ రోడ్ షోలకు బృందాకారత్ రాక
 – రాహుల్ గాంధీ,ప్రియాంక సభకు కాంగ్రెస్ ఏర్పాట్లు
 – విజయశాంతి, పవన్ కల్యాణ్ ల రోడ్ షోలు
నవతెలంగాణ-సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల్లో తదుపరి ఘట్టానికి తెర లేచింది. నామినేషన్ల తో పాటు  ఉపసంహరణల ఘట్టం కూడా ముగిసిన నేపథ్యంలో  జిల్లావ్యాప్తంగా ప్రచారంతో అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు.  జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల సభలు, ప్రసంగాలతో జిల్లాలో ఎనిమిది రోజుల పాటు ఎన్నికల సందడి నెలకొననున్నది.పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ(ఎం), బిఎస్పి,బీజేపీ ల పక్షాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో జిల్లా పర్యటనకు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ నెల 28 వ తేదీ వరకు  జిల్లా ప్రచారంలో మునిగి ఫోనున్నది. కాగా నేడు జిల్లా కేంద్రంలో జరిగే సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. అభ్యర్థి జగదీష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక కొత్త మార్కెట్ యార్డు వద్ద గల బహిరంగ ప్రదేశంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్ సభ జరగనున్నది. కేసీఆర్ సభ తో ఆ పార్టీలో మరింత ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం లు దామన్న కు మద్దతు గా పట్టణంలో నిర్వహించిన రోడ్ షో విజయవంతం కావడంతో కార్యకర్తలు ఉత్సాహంగా వున్నారు. ఈ క్రమంలో  రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ లతో జిల్లాలో సభల ఏర్పాట్లకు ఉత్తంకుమార్ రెడ్డి ,దామోదర్ రెడ్డి లు ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా సూర్యాపేటలో మాత్రం 25 లేక 26 న ప్రియాంక గాంధీ తో సభ ఏర్పాటు కు దామన్న కృషి చేస్తున్నట్లు సమాచారం. ఇదిగాక విజయశాంతి తో జిల్లా కేంద్రంలో రోడ్ షో ఏర్పాటు చేయనున్నారు.ఇక సిపిఐఎం కోదాడ అభ్యర్థి మట్టిపెల్లి సైదులు, హుజుర్ నగర్ అభ్యర్థిని మల్లు లక్ష్మీ ల విజయం కోసం ఈ నెల 28 న బృందాకారత్ రోడ్ షోలో పాల్గొన్ననున్నారు. ఈసారి ఎన్నికల బరిలో దిగిన  భహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ 22 వ తేదీన స్థానిక గాంధీ నగర్ లో సభ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్ననున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధాని మోడీ సభ ఏర్పాటు కోసం బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరావు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ ను పిలిపించి పట్టణంలో రోడ్ షో కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ రకంగా జిల్లాలోని అన్ని పార్టీలు కూడా ప్రచార హోరులో మునిగిపోతున్నాయి. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు.  ఈ క్రమంలో నియోజకవర్గంలో పరిశీలిస్తే గతంలో పోటీ చేసిన వారే రంగంలో ఉన్నారు. ప్రధానంగా ఈ సారి బహుజన సమాజ్ పార్టీ నుండి కొత్తగా వట్టే జానయ్య యాదవ్  బరిలో వున్నారు. బీఆర్ఎస్   అభ్యర్థిగా గుంట కండ్ల జగదీశ్ రెడ్డి మరోమారు తన అదృష్టాన్ని పరీక్ష పరీక్షించుకోబోతున్నారు. ప్రధానంగా తన 9 సంవత్సరాల  పదవీ కాలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజల వద్ద ఏకరువు పెడుతున్నారు. దాదాపుగా 7500 కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గంలో పనులు చేపట్టానని తనకు మరోమారు అవకాశం ఇస్తే నియోజక వర్గాన్ని అద్భుతమైన నగరం గా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓటు తో పాటు నియోజకవర్గo  బీఆర్ఎస్ లో ఉన్న అంతర్గత కలహాలు తన విజయానికి బాటలు వేస్తాయని భావిస్తున్నారు. ప్రధానంగా  టీజేఎస్, సిపిఐ,వైసిపి ల తో పెట్టుకున్న పొత్తు కలిసొస్తుందని ఆశ ఆయన లో ఉన్నారు. అదేవిధంగా రెబెల్స్ బెడద  కూడా లేకుండా ఉండడంతో తన గెలుపు ఖాయమనే దీమాలో ఉన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు మాత్రం కేంద్ర ప్రభుత్వాo ద్వారా  జిల్లాలో అభివృద్ధి పనులు జరిగాయని అదంతా కూడా మోడీ ఘనతగా వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా ఈ పార్టీకి గ్రామస్థాయిలో, బూత్ స్థాయిలో కొంతమేరకు పార్టీ లోపం కనిపిస్తుంది. దీనిని అధిగమించేందుకు సంకినేని శ్రమిస్తున్నారు. ఇదే క్రమంలో  బహుజన సమాజ్ పార్టీ నుండి  అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నారు. పలు ప్రజా సంఘాల అండ తనకు లభిస్తుందనే ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. ఇది గాక బీసీ సామాజికవర్గం తన వైపే ఉంటుందనే ధీమాతో ప్రజల వద్దకు వెళుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అగ్ర వర్ణాల అభ్యర్థులే ఈసారి కూడా బరిలో ఉన్నారని, వారిని కాదని తనకు ఓటు వేయాలని ఆయన ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నుండి జానయ్య బరిలో ఉండటంతో చతుర్ముఖ పోటీ గా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచార కార్యక్రమాలను, సభలను ముమ్మరం చేస్తూ ప్రజలను ఆకర్షించే యత్నాలు చేస్తున్నాయి. మరి ఈ ఆకర్షణలో ఏ పార్టీ ముందంజలో పయనిస్తుందో వేచి చూడాలి.
Spread the love