సీపీఐ(ఎం) అభ్యర్థులను ఓట్లు వేసి గెలిపించండి

–  ప్రజా సమస్యల పోరాట సారధులు కమ్యూనిస్టులే
– ఎమ్మెల్యే పదవి ఆభరణం కాదు ఆయుధం
– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ – భువనగిరి: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే సారధులు కమ్యూనిస్టులేనని వారిని ప్రజలు ఆదరించి రానున్న అసెంబ్లీ ఎన్నికలలో సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నరసింహను గెలిపించాలని సిపిఎం కేంద్రీ కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విజ్ఞప్తి చేశారు. గురువారం భువనగిరి మార్కెట్ యార్డ్ నుండి పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా, బాబు జగ్జీవన్ రావు చౌరస్తా, జగదేపూర్ చౌరస్తా మీదుగా స్థానిక సుందరయ్య కార్యాలయం వరకు సీపీఐ(ఎం) శ్రేణులు ఎర్రజెండా చేత పట్టుకొని నినాదాలు చేస్తూ, సిపిఎం ను గెలిపించాలని కోరుతూ, డప్పు వాయిద్యాలతో ప్రదర్శన నిర్వహించారు. అంతరం పార్టీ కార్యాలయంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన సభ నిర్వహించారు .ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాటానికి పురిటిగడ్డ భువనగిరి అని పేర్కొన్నారు. ఆ చరిత్రను పునరావృతం చేసే విధంగా ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త కమ్యూనిస్టు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. రానున్న ఎన్నికలలో కమ్యూనిస్టుల బలము నిరూపించుకునే సమయం ఆసన్నమైనదన్నారు.
ఎమ్మెల్యే పదవి సీపీఐ(ఎం)కు ఆభరణం కాదని ఆయుధమని పేర్కొన్నారు. పోరాడే వారి చేతిలో ఆయుధం లేకుండా స్వార్ధపరుల చేతిలో ఆయుధం పెడితే సమాజం నష్టపోతుందన్నారు. కమ్యూనిస్టుల మనోభావాలను దెబ్బ తినే విధంగా ప్రసంగాలు ఇస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పేందుకు కమ్యూనిస్టులు నడుము బిగించి పోరాడిన అవసరం ఉందన్నారు. ప్రజలు కమ్యూనిస్టులపై చూపుతున్న ఆదరణ ఆయుధంగా అనేక పోరాటాలు సాధించి విజయం సాధించామన్నారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల వారసత్వంతో పనిచేస్తున్న కమ్యూనిస్టులకు ఈ ఎన్నికలలో ఓట్లు వేసి సహకరించాలని కోరారు. 10 సంవత్సరాల నుండి కేంద్ర, రాష్ట్రాలను పాలిస్తున్న బిజెపి, బీఆర్ఎస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి పది సంవత్సరాలలో 20 కోట్ల నిరుద్యోగాలను ఎక్కడ భర్తీ చేశావో చూపించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సవాలు విసిరారు. రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పరికరాలను విత్తనాలను అందించకుండా రైతుబంధు పథకాన్ని అడ్డం పెట్టుకొని రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు.
ప్రజా సమస్యలను విస్మరించి పాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలకు, ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు అండగా ఉంటుందన్నారు. రైతు సమస్యలపై వ్యవసాయ కూలీల సమస్యలపై కార్మికుల సమస్యలపై ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఎం భువనగిరి అభ్యర్థి కొండమడుగు నరసింహ కు ప్రజలు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ ప్రజల గొంతుకైన కమ్యూనిస్టులను ఈ ఎన్నికలలో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నామని అందరివాడిగా కొండమడుగు నర్సింహా పనిచేస్తున్నారని చెప్పారు. ధన, సేవా బలం మధ్యనే ఎన్నికలు జరుగుతున్నాయని నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధాన పార్టీ నాయకులు డబ్బులు నమ్ముకుని రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేసి భవిష్యత్తును కాపాడుకోవాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కమ్యూనిస్టులు పనిచేస్తారని తెలిపారు. నియోజకవర్గంలో కాంట్రాక్టు పాలన జరుగుతుంది. సిపిఎం అభ్యర్థి కొండమడుగు నరసింహ. భువనగిరి నియోజకవర్గంలో ప్రజా నాయకుల పాలన సాగడం లేదని కాంట్రాక్టులు భూదందాల పాలన కొనసాగుతుందని సిపిఎం అభ్యర్థి కొండమడుగు నరసింహ విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి ఇద్దరు బెంగళూరు బ్రదర్స్ గా పేరు గడించారన్నారు. ఇక్కడ కొట్లాడుతున్నట్టు చేస్తూ అక్కడ వ్యాపారాలు చేసుకునే స్నేహితులన్నారు. ప్రజలను మోసం చేయడానికి వీరు రెండు పార్టీలలో చేరి భువనగిరి అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. వీరిని కలవాలంటే హైదరాబాదుకే వెళ్లాలన్నారు. ఆ పార్టీలకు కార్యాలయాలు కూడా లేవు అన్నారు.
సీపీఐ(ఎం)అభ్యర్థిగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటానన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న పార్టీ ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా రాబోయే పోరాటాలు ఉంటాయని ప్రజలు ఆశీర్వదించాలని సేవకుడిగా పని చేస్తానని కొండమడుగు పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గంలో మూసి కాలుష్యాన్ని పట్టించుకునే నాధుడు లేడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వడపర్తికాత్వ ద్వారా సాగునీరు అందించాలని కోరారు. కాళేశ్వరం బస్వాపురం ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలన్నారు. భూనిర్వాసితులను పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించాలని కోరారు. తమ చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం గతంలో కొద్ది మేరకు దిగివచ్చి వారికి లో కొందరికి నష్టపరిహారం చెల్లించిందన్నారు.
వ్యవసాయ కూలీల ,కార్మిక సమస్యలు ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పేర్కపోయాయన్నారు. అంగన్వాడి, ఆశాలు, మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులు, రైతాంగ సమస్యలు, వృత్తిదారుల సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. గీత, మత్స్య కార్మికుల గొర్రెల పెంపకం దార్ల, చేనేత వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ప్రజల చిరకాల వాంఛ అయిన భువనగిరి లో టౌన్ హాల్ నిర్మాణానికి, అవుట్డోర్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. బీబీనగర్లో మూతపడ్డ పరిశ్రమలు తెరిచే విధంగా కృషి చేస్తానన్నారు. పోచంపల్లిలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి పార్టీ ముందుండి పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. భువనగిరి పట్టణ ప్రజలకు ప్రతిరోజు రక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. జనరల్ స్థానంలో రాష్ట్ర సీపీఐ(ఎం) కమిటీ ఒక దళితుడికి స్థానం కేటాయించడం ఇందులో నాకు అవకాశం కల్పించడం మర్చిపోలేను అన్నారు. నాయకులు, కార్యకర్తలు ధైర్యంతో ముందుకు నడవాలని తన విజయంలో పాలుపంచుకోవాలని కొండమడుగు నరసింహ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, మంగ నరసింహ, కల్లూరు మల్లేశం, దాసరి పాండులు జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, దయ్యాల నరసింహ, సూరుపంగ స్వామి, మద్దెల రాజయ్య, బోలగాని జయరాములు, గూడూరు అంజిరెడ్డి, గడ్డం వెంకటేష్, వనం రాజు, కళ్లెం సుదర్శన్ రెడ్డి, రాసాల వెంకటేష్, బర్ల వెంకటేష్, గంధ మల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, ఆరే విజయ్ కుమార్, కొండ అశోక్ , మంచాల మధు, అన్నం పట్ల కృష్ణ, వడ్డెబోయిన వెంకటేష్ పాల్గొన్నారు.

Spread the love