నేడు పోచంపల్లికి రాష్ట్రపతి ముర్ము..

నవతెలంగాణ యాదాద్రి భువనగిరి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) భూదాన్‌ పోచంపల్లి(Bhoodan Pochampally Village)లో పర్యటించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆమె బుధవారం పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లి టై అండ్‌ డై, ఇక్కత్‌ చీరెలను తయారీని పరిశీలించనున్నారు. వివిధ అవార్డు గ్రహీతలు, నేత కార్మికులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వారం రోజులుగా ఏర్పాట్లను కలెక్టర్‌ హన్మంతు షిండే, అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావులు పరివేక్షించారు.
ఉదయం 11.10 నుంచి మధ్యాహ్నం 12.10గంటల మధ్య రాష్ట్రపతి పర్యటన కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. సుమారు గంట పాటు పట్టణంలో గడుపనున్నారు. బుధవారం బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రాష్ట్రపతి పోచంపల్లికి చేరుకుంటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భారీ కాన్వాయ్‌తో పట్టణంలోని టూరిజం సెంటర్‌, ఆచార్య వినోబాబావే భవనానికి వెళ్తారు. భూదాన ఉద్యమకారులైన వినోబాబావే, వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు నివాళులర్పిస్తారు. అనంతరం వినోబాబావే భవనంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోచంపల్లి పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Spread the love