ఎన్నికల వేళ…నాగార్జునసాగర్ డ్యాంపై ఉద్రిక్తత 

డ్యాం భద్రత బలగాలు, ఆంధ్ర పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం

– రైట్ బ్యాంకు ప్రధాన గేట్ నుంచి చొచ్చుకొచ్చిన ఆంధ్ర పోలీస్ బలగాలు

– అడ్డుకున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ లపై దాడి

– డ్యామ్ భద్రత కోసం ఏర్పాటుచేసిన సిసి కెమెరాల సైతం పగలగొట్టిన వైనం-

– దౌర్జన్యాలను చిత్రీకరిస్తున్న సెల్ఫోన్లను సైతం పగలకొట్టారు.

– 13వ గేట్ వరకు మాదే నందు దౌర్జన్యం

నవతెలంగాణ -పెద్దవూర

తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న సమయంలో గురువారం తెల్లవారు జామున నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ పై ఉద్రిక్తత నెలకొంది. సుమారు రెండు గంటల ప్రాంతంలో ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో ఇరు రాష్ట్రాల డిఎస్పిల మధ్య జరిగిన వాగ్వాదం తిరిగి గురువారం మళ్ళీ రిపీటైంది. దీంతో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల పొలీసులు ఘర్షణకు దారి తీసింది. బుధవారం అర్ధరాత్రి (తెల్లారితే గురువారం) సుమారు రెండు గంటల సమయంలో నాగార్జున సాగర్ డ్యామ్ పై ఆంధ్ర పోలీసులు బలవంతంగా రైట్ బ్యాంక్ ప్రధాన గేటు నుండి చొచ్చుకొచ్చారు. దీనితో అడ్డుకున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ లను గాయపరిచి 13వ గేటు మా ఆధీనంలో ఉంటుందని దాదాపు ఎఎస్పీ 700 మంది పోలీస్ జవాన్లు 13వ గేటు వరకు దూసుక వచ్చారు.13వ గేట్ వరకు చేరుకున్న ఆంధ్ర పోలీసులను అనుమతి లేదంటూ తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మధ్య ఘర్షణ

ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్యాం భద్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ సెల్ఫోన్లను ధ్వంసం చేశారు. దీనితో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు డ్యాంపై చేరుకోవడంతో ఆంధ్ర పోలీసులను అడ్డుకోవడంతో ఆంధ్ర తెలంగాణ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. డ్యామ్ పైకి ప్రాజెక్టు అధికారులు తప్ప ఇతరులు ఎవరిని అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ రెండు ఘటనలతో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య గొడవ జరిగింది. అనంతరం ఇరు రాష్ట్రాల పోలీసులు తమ ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు.

2015లో జలవివాదం

2015 ఫిబ్రవరి 13న నాగార్జున సాగర్ లో ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం రాగా రెండు ప్రభుత్వాలు పంతానికి పోవడంతో నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఆ సమయంలో తీవ్ర ఉద్రికత్తలు తలెత్తాయి. తెలంగాణ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏపీ అధికారులు కుడిగట్టు క్రస్ట్‌ గేట్ల స్విచ్‌ రూమ్‌ తలుపులు పగలగొట్టారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పోలీసులు పరసర్పం ముష్టిఘాతాలకు దిగారు. పోలీసుపై పోలీసులే లాఠీచార్జీకి దిగి కొట్టుకునేంత వరకు వెళ్లారు.అయితే 2015లో రెండు రాష్ట్ర ప్రభుత్వాల విభేదాల కారణంగా రచ్చ జరగగా మళ్ళీ తెలంగాణ లో ఎన్నికలు జరిగే రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు బద్రత దళాల మధ్య గొడవలు, లైట్లు, కెమెరాలు ధ్వంసం చెయ్యడం సూస్తుంటే ఇది రాజకీయంగా జరిగిన దాడి అని తెలుస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఈసారి ఓటమి దిశగా ఉన్నట్లు పలు సర్వేలు తెల్చాయి.ఈ క్రమంలో సాగర్ సరిహద్దు వద్దు తీవ్ర ఉద్రిక్తత చోటుచేదుకోవడం చూస్తుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు ఒక్కటై ఈ వివాదం సృష్టిస్తున్నారంటు చర్చ జరుగుతోంది. అయితే ఈ గొడవ ఎంత వరకు దారి తీస్తుందనేది తెలియడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు భద్రత సిబ్బంది, ప్రజలు భయందోళన చెందుతున్నారు.

Spread the love