ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు చేదు అనుభవం

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయం యాక్షన్, థ్రిల్లర్, డ్రామా జానర్ సినిమా కంటే ఆసక్తికరంగా సాగుతోంది. అధికార కూటమి నేతల మధ్య మాటల తూటాలతో రాజకీయం రంజుగా మారింది. వీరికి తోడు జనం కూడా ఈ ఎన్నికల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రచారానికి వస్తున్న అభ్యర్థులకు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీరాజనం పడుతుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం చేదు అనుభవంతో వెనుదిరగాల్సి వస్తోంది. తాజాగా వైసీపీ మంత్రి రోజాకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి రోజా ప్రచారాన్ని వడమాలపేట మండలం వేమాపురం గ్రామస్థులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారం నిర్వహించడానికి ప్రచారం రథంలో వచ్చి.. ఓట్లు అభ్యర్థిస్తుండగా గ్రామస్థులు ఆమెను అడ్డుకున్నారు. తమ గ్రామానికి ఏం మేలు చేశారని ఓట్లు అడగడానికి వచ్చారని మంత్రిని నిలదీశారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు, వైసీపీ శ్రేణుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఆపై ఆమె పది నిమిషాల పాటు అక్కడే ఉండి వెనుదిరిగారు.

Spread the love