మణిపూర్‌ భవన్‌ను ముట్టడించిన ఐద్వా

న్యూఢిల్లీ : మణిపూర్‌లో కుకీ మహిళలను వివస్త్రను చేసి సామూహిక ఘోరాన్ని నిరసిస్తూ మహిళా సంఘాలు న్యూఢిల్లీలోని మణిపూర్‌ భవన్‌కు ర్యాలీ నిర్వహించాయి. గురువారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లోనిమణిపూర్‌ భవన్‌కు చేరుకున్న కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ రాజీనామా చేయాలని, మణిపూర్‌లో మహిళలకు భద్రత లేదని ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే విమర్శించారు.. ఐద్వా ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి మైమూనా మొల్లాతో పాటుగా ప్రగతిశీల మహిళా సంఘటన్‌, నార్త్‌-ఈస్ట్‌ ఫోరమ్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సాలిడారిటీ, సెంటర్‌ ఫర్‌ స్ట్రగుల్‌ ఉమెన్‌ వంటి సంస్థల నాయకులు పాల్గొన్నారు.
మణిపూర్‌ ఘటనకు నిరసనగా భారీ ప్రదర్శనలు
ఇంఫాల్‌/న్యూఢిల్లీ : మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించిన ఘటనను నిరసిస్తూ చురాచంద్‌పూర్‌లో గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అమానుష చర్యకు పాల్పడిన కామాంధులపై తక్షణమే చర్య తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ మహిళా కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళా కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు నెత్తా డి సౌజా నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు జంతర్‌మంతర్‌ వద్ద ప్రదర్శన జరిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని, మహిళలకు అక్కడ భద్రతే కరువైందని డి సౌజా ఆరోపించారు. మణిపూర్‌ హింసపై మౌనం వహిస్తున్న ప్రధాని మోడీ కూడా బాధ్యత వహించాలని అన్నారు. కాగా యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్లమెంట్‌ భవనం వైపు ప్రదర్శనగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కోకో పథీ మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కానీ, ప్రధాని కానీ బాధ్యత తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

Spread the love