మణిపూర్‌ హింసాకాండను నియంత్రించండి

–  ప్రజల బాధాకరమైన పరిస్థితుల
– పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరం
– కేంద్ర హౌం మంత్రి అమిత్‌
షాను కోరిన ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ
న్యూఢిల్లీ: మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌ (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాసింది. మణిపూర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జనరల్‌ సెక్రెటరీ అన్నీ రాజా, జాతీయ కార్యదర్శి నిషా సిద్ధూ లు అమిత్‌ షాకు రాసిన లేఖపై సంతకం చేశారు. మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య మే 3న చెలరేగిన జాతి హింస తీవ్ర అల్లర్లకు కారణమైన విషయం విదితమే. ఈ హింసలో వేలాది మంది నిరాశ్రయులు కాగా, 140 మందికి పైగా మరణించారు.మణిపూర్‌ను చుట్టుముట్టిన హింస ఆ రాష్ట్ర ప్రజలకు అపారమైన బాధను కలిగించిందని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ పేర్కొన్నది. రాష్ట్రవ్యాప్తంగా మే మొదటి వారం నుంచి అనేక మార్చురీలలో క్లెయిమ్‌ చేయని అనేక కుళ్ళిపోతున్న మతదేహాల బాధాకరమైన పరిస్థితిని లేఖ ఎత్తిచూపింది. మణిపూర్‌ సంక్షోభం నుంచి ఉత్పన్నమయ్యే అత్యవసర విషయాలను పరిష్కరించడానికి అమిత్‌ షా తక్షణమే జోక్యం చేసుకోవాలని మహిళా సంస్థ విజ్ఞప్తి చేసింది. గుర్తుతెలియని మృతదేహాలతో సహా అన్నిటికీ పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ప్రముఖ వైద్య సంస్థకు చెందిన స్వతంత్ర ఫోరెన్సిక్‌ నిపుణుడి నేతృత్వంలో మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సంస్థ నొక్కి చెప్పింది.చనిపోయినట్టు భయపడుతున్న తప్పిపోయిన వ్యక్తుల కుటుంబాలను సంప్రదించగలిగే అధికారిని నియమించాలని లేఖలో హౌం మంత్రికి విజ్ఞప్తి చేశారు. మతుల కుటుంబాలను మణిపూర్‌కు సురక్షితంగా తరలించాలని సదరు సంస్థ కోరింది. కేంద్ర హౌం మంత్రి నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఆశాభావాన్ని మహిళా సంస్థ వ్యక్తం చేసింది. హింస చెలరేగడం రాష్ట్ర సామూహిక స్పృహపై తీవ్ర ప్రభావాన్ని చూపిందనీ, మణిపూర్‌ ప్రజలు ఎదుర్కొంటున్న బాధాకరమైన పరిస్థితులను పరిష్కరించడానికి తక్షణ చర్యలు అవసరమని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ వివరించింది.

Spread the love