మణిపూర్‌ హింసపై మౌనమెందుకు?

ప్రధాని వైఖరిని తప్పుపట్టిన ప్రతిపక్షాలు
ఇంఫాల్‌ : హింసాకాండతో మణిపూర్‌ అట్టుడుకుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడాన్ని పది ప్రతిపక్ష పార్టీలు తప్పుపట్టాయి. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరేందుకు త్వరలో ప్రధానిని కలవాలని ఆ పార్టీలు నిర్ణయించాయి. కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, జేడీయూ, ఎఐఎఫ్‌బీ, ఆర్‌ఎస్‌పీ, శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే), తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, ఆప్‌ పార్టీల నేతలు ఇంఫాల్‌లోని కాంగ్రెస్‌ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మణిపూర్‌ పీసీసీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నివారించి, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా సమావేశం మూడు తీర్మానాలను ఆమోదించింది. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితిపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సమావేశం డిమాండ్‌ చేసింది. హింసాత్మక సంఘటనలతో రాష్ట్రం ఉడికిపోతుంటే గత 36 రోజులుగా ప్రధాని మౌనం వహించడాన్ని తీవ్రంగా ఖండించింది. కాగా మణిపూర్‌లో శాంతి స్థాపన కోసం కాంగ్రెస్‌ పార్టీ ఐదు పాయింట్ల అజెండాను రూపొందించింది. మణిపూర్‌లో ఇలాంటి భీతావహ వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదని పీసీసీ ఉపాధ్యక్షుడు హెచ్‌.గోస్వామి వ్యాఖ్యానించారు.

Spread the love