మణిపూర్‌లో పర్యటించండి

– అమిత్‌ షా, బీరేన్‌ రాజీనామాలు కోరండి
– దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయండి
– రాష్ట్రపతికి ఎన్‌ఏపీఎం వినతి
న్యూఢిల్లీ : మే 4న మణిపూర్‌లో కుకీ యువతులపై జరిగిన లైంగిక దాడిని నేషనల్‌ అలయన్స్‌ ఫర్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ఎన్‌ఏపీఎం) తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక చర్యలపై విచారణ జరిపేందుకు స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరింది. రాష్ట్రంలో పర్యటించి స్వయంగా పరిస్థితిని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్రపతికి ఎన్‌ఏపీఎం ఓ లేఖ రాసింది. పర్యావరణవేత్త మేథా పాట్కర్‌, మాజీ అధికారి హర్ష్‌ మందర్‌, కవి మీనా కందసామి సహా 3.256 మంది ఆ లేఖపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో పర్యటించే నిజనిర్ధారణ బృందాలు, శాంతి కమిటీలు ఎటువంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా వ్యవహరించే వాతావరణం కల్పించాలని వారు ఆ లేఖలో కోరారు. రాష్ట్ర షెడ్యూల్డ్‌ తెగల జాబితాలో ఏకపక్షంగా ఎటువంటి అదనపు చేర్పులు చేయకుండా చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘మే 4న జరిగిన ఘటనకు సంబంధించి నిందితులను అరెస్ట్‌ చేయడంలో పోలీసులు తీవ్రమైన జాప్యం చేశారు. నిందితులు యువతులను నగంగా ఊరేగించి, ఆపై అత్యాచారం చేశారు. ఇందుకు వీడియో సాక్ష్యం కూడా ఉంది. గిరిజన మహిళ అయిన మీరు రాష్ట్రంలో పర్యటించండి. స్వయంగా పరిస్థితిని తెలుసుకోండి. హింసాకాండకు బాధ్యత వహించి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నిస్సిగ్గుగా విభజన రాజకీయాలు చేయడం దురదృష్టకరం. క్షమించరాని నేరం. మణిపూర్‌లో బలహీనులైన తెగల వారి జీవితాలపై మెజారిటీ తెగల వారితో కలిసి ప్రభుత్వం విభజన రాజకీయాలకు తెగబడింది. విద్వేషపూరిత నేరాలు అడ్డూ అదుపూ లేకుండా సాగేందుకు సాయపడింది. ఆ నేరాలకు పాల్పడిన వారిని శిక్షించకుండా వదిలేసింది. దారుణ వైఫల్యాలకు నైతిక, చట్టపరమైన బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా అమిత్‌ షా, బీరేన్‌ సింగ్‌లను కోరండి’ అని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో పనిచేసే పౌర సమాజ బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి బెదిరింపులు రాకుండా చూడాలని, అవి స్వేచ్ఛగా తమ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో ఎన్‌ఏపీఎం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో అలజడికి ప్రభుత్వ ప్రేరేపిత హింసే కారణమంటూ మణిపూర్‌లో పర్యటించిన భారత మహిళా కమిషన్‌ జాతీయ సమాఖ్య సభ్యులు నిర్ధారించారని, అయితే వారి పైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని గుర్తు చేసింది. రాష్ట్రంలో ఇంటర్నెట్‌పై కొనసాగుతున్న నిషేధాన్ని రాష్ట్రపతి దృష్టికి తెచ్చింది. సంఘటన జరిగిన మే 4వ తేదీనే తన దృష్టికి వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడంలో జాతీయ మహిళా కమిషన్‌ జాప్యం చేసిందని విమర్శించింది.

Spread the love