ఫ్రాన్స్‌లో మోడీ

– సెనెట్‌ అధ్యక్షునితో భేటీ
న్యూఢిల్లీ : నౌకల నుండి ప్రయోగించగల రాఫెల్‌ జెట్‌లను, స్కార్పియన్‌ జలాంతర్గాములను ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేయడానికి భారత్‌ గురువారం ఆమోద ముద్ర వేసింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ గురువారం పారిస్‌ చేరుకున్నారు. బాస్టిల్లే పతనం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించనున్న వేడుకులకు మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న సంగతి తెలిసిందే. తొలుత ఆయన ఫ్రాన్స్‌ ఎగువ సభ (సెనెట్‌) అధ్యక్షులు గెరార్డ్‌ లార్చర్‌తో గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. అంతుకుముందు ఆయనకు పారిస్‌ విమానశ్రయంలో ఫ్రాన్స్‌ ప్రధానమంత్రి ఎలిజిబెత్‌ బోర్నే స్వాగతం పలికారు. ఫ్రాన్స్‌ అధ్యక్షులు ఇమ్మాన్యుల్‌ మేక్రాన్‌తో కలిసి శుక్రవారం జరిగే ఫ్రెంచ్‌ జాతీయదినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఫ్రాన్స్‌, భారత్‌ వాయుసేన దళాలు ప్రదర్శించే సంయుక్త విన్యాసాలను కూడా వారు వీక్షించనున్నారు.
26 రాఫెల్‌ జెట్‌లు, మూడు స్కార్పియన్‌ జలాంతర్గాముల కొనుగోలు
మోడీ ఫ్రాన్స్‌ పర్యటన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) 26 రాఫెల్‌ జెట్‌లు, మూడు స్కార్పియన్‌ జలాంతర్గాములు కొనుగోలు ప్రతిపాదనలను ఆమోదించిందని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. 26 జెట్‌ల్లో నాలుగు శిక్షణా విమానాలుగా వుంటాయని ఆ వర్గాలు చెప్పాయి. కాంట్రాక్టుపై సంతకం చేసిన మూడేండ్ల వ్యవధిలో విమానాలను అందచేయం ఆరంభమవుతుంది. అయితే వీటి ధరపై ఇంకా చర్చలు జరగాల్సి వున్నందున తుది ఒప్పందం కుదరడానికి దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. భారత నావికాదళానికి అవసరమైన 26 రాఫెల్‌ జెట్‌లతో పాటూ వాటితో ముడిపడిన ఇతర అనుబంధ పరికరాలు, ఆయుధాలు, సిమ్యులేటర్‌, ఫ్రెంచి ప్రభుత్వం నుంచి అందాల్సిన లాజిస్టిక్‌ సపోర్టు, సిబ్బంది శిక్షణ, విడిభాగాలు, అన్నింటినీ ఫ్రెంచి ప్రభుత్వం నుంచి పొందడానికి డీఏసీ ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇతర దేశాలు ఇటువంటి విమానాలను ఏ ధరకు అందిస్తున్నాయో వాటితో సరిపోల్చుకుని, సంబంధిత అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఫ్రెంచి ప్రభుత్వంతో ధర, ఇతర అంశాలు చర్చిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. చర్చల తర్వాత వీటి నిర్వహణ, మరమ్మత్తులకు సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కూడా కాంట్రాక్ట్‌ ఒప్పందాల్లో చేరుస్తారని చెప్పాయి. శుక్రవారం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌తో మోడీ చర్చల అనంతరం ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. దేశీయంగా రూపొందించిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ కోసం ఈ రాఫెల్‌ జెట్‌లను భారత నావికాదళం సమకూర్చుకుంటోందని అధికారులు తెలిపారు. భారత వైమానిక దళానికి ఇప్పటికే 36 రాఫెల్‌ జెట్‌లను సమకూర్చారు.

Spread the love