వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు పెంచాలి

– సంబధిత జీఓను వెంటనే సమీక్షించాలి
– కార్మికశాఖ కార్యాలయం వద్ద ధర్నాలో ఆర్‌.వెంకట్రాములు
– ఎస్వీకే నుంచి లేబర్‌ ఆఫీసు వరకు భారీ ర్యాలీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల వేతనాలు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఆ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని లేబర్‌ కమిషనర్‌ ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో వ్యవసాయ కార్మికుల జీవనం దుర్బరంగా మారిందన్నారు. రోజుకూలి రూ.200-300 ఉన్నదని, రెండేండ్లకొకసారి కనీస వేతనాలు పెంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లు గా సమీక్షించకపోవడం దుర్మార్గమని అన్నారు. విద్య, వైద్యం, తదితర ఖర్చులు పెరిగాయని, కనీసవేతనాల జీఓను సమీక్షించి రోజుకు రూ.600 ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికశాఖ కమిషనర్‌ ద్వారా గ్రామాల్లో పోస్టర్లు, కరపత్రాలు వేసి, మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిం చాలని కోరారు. వ్యవసాయ కార్మికుల భద్రతకు సమగ్ర చట్టం చేయాలని, బీమా సౌకర్యం కల్పించా లని అన్నారు. సంక్షేమ పథకాలు, ఇండ్ల స్థలాలు, ఇండ్లు మంజూరులోనూ అన్యాయం జరుగుతు న్నదని వాపోయారు. ఏ ఆస్తిలేకుండా రెక్కల కష్టంతో జీవనం సాగిస్తున్న వ్యవసాయ కార్మికులకు సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అనంతరం డిప్యూటీ లేబ ర్‌ కమిషనర్‌కు మెమో రాండం అందజేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకె ళ్తానని ఆయన హామీ నిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం మహిళా కన్వీనర్‌ బి.పద్మ, రాష్ట్ర కార్యదర్శులు పొన్నం వెంకటేశ్వరరావు, పెద్ది వెంకట్రాములు, ఎం.ఆంజనేయులు, ఆర్‌.శశిధర్‌, ఎం.నర్సింహులు, ఎం.రాములు, ఎం.వెంకటయ్య, యు.గోపాల్‌, లంక రాఘవులు, అల్వాల వీరయ్య, కందుకూరి జగన్‌, సాంబశివ, సమ్మయ్య, జిల్లా కార్యదర్శులు రేపాకుల శ్రీనివాస్‌, కె.మల్లేష్‌, నర్సింహులు, ఆర్‌. దేవదాసు, డి.సరోజ, ఆర్‌.ఆంజనేయులు పాల్గొన్నారు.

Spread the love