9 ఏండ్ల పాలనపై 9 ప్రశ్నలు

– మోడీకి కాంగ్రెస్‌ సవాల్‌
– డాక్యుమెంట్‌ విడుదల
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రస్తుత కేంద్రప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సవాల్‌ విసిరింది. కాంగ్రెస్‌.. ప్రధాని మోడీని 9 ప్రశ్నలు అడగాలనుకుంటున్నదని ఆ పార్టీ జనరల్‌ సెక్రెటరీ జైరాం రమేశ్‌ అన్నారు. అలాగే, మోడీ 9 ఏండ్ల పాలనలపై ‘9 సంవత్సరాలు 9 ప్రశ్నలు’ (నౌ సాల్‌, నౌ సవాల్‌) డాక్యుమెంట్‌ను తాము విడుదల చేస్తున్నామని చెప్పారు. మోడీ నేతృత్వంలోని తొమ్మిదేండ్ల కేంద్ర ప్రభుత్వ పాలన దేశాన్ని వైఫల్యం, కష్టాలతో నింపిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వం తానిచ్చిన హామీలను నెరవేర్చలేదనీ, దేశ ప్రజలు నిరుద్యోగం, జీఎస్టీ, ద్రవ్యోల్బణం, నియంతృత్వ నిర్ణయాలు వంటి వాటిని భరించాల్సి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ”2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని వాగ్దానం చేశారు. అందరికీ ఇండ్లు కల్పిస్తాన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి రూ. 15 లక్షలు ఇస్తామన్నారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు” అని కాంగ్రెస్‌ పార్టీ గుర్తు చేసింది. గొంతెత్తితే నొక్కేస్తున్నారనీ, ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ”ఇవి 9 ఏండ్ల పాలనలో వైఫల్యాలు. ప్రజలు వారి(మోడీ ప్రభుత్వం) పట్ల విసుగు చెందారు. మోడీని, ఆయన అవినీతి ప్రభుత్వాన్ని తిరస్కరించిన కర్నాటక ఎన్నికలే దీనికి రుజువు. దక్షిణాది మొదలైన ఈ అసంతృప్తి దేశ మొత్తం వ్యాపిస్తుంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. సరైన సమాధానం ఇస్తారు” అని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొన్నది. 2014, మే 26న తొలిసారి, 2019, మే 30న రెండో సారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే.

Spread the love