ఉత్తరాదిలాగా ఎందుకు బలపడట్లేదు?

– 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశంలో చర్చ
– దక్షిణాదిలో పట్టు కోసం ప్రత్యేక ఎజెండా పోలింగ్‌ బూత్‌ వారీగా బలోపేతం కావాలని నడ్డా ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉత్తరాది రాష్ట్రాల్లోలాగా దక్షిణాదిలో ఎందుకు బలపడలేకపోతున్నాం? లోపం ఎక్కడ జరుగుతున్నది? ఎలా ముందుకెళ్ళాలి? రాజకీయ పట్టు కోసం ఏం చేయాలి? పోలింగ్‌ బూత్‌ల వారీగా ఎందుకు బలోపేతం కాలేకపోతున్నాం? తదితర అంశాలపై ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశంలో సుధీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఆ సమావేశం సుధీర్ఘంగా 6 గంటల పాటు కొనసాగింది.
ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దక్షిణాదిలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు, పార్టీ బలోపేతం, విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి ఒక ప్రత్యేక ఎజెండాతో ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేండ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధినీ క్షేత్ర స్థాయిలోకి చాలా మందికి తెలిసేలా ప్రచారం చేయాలని నడ్డా ఆదేశించినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది. జాతీయ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని నడ్డా స్పష్టం చేసినట్టు, అదే సమయంలో పలు రాష్ట్రాల అధ్యక్షుల పనితీరుపైనా, నేతల మధ్య సమన్వయలేమిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. తమిళనాడు అధ్యక్షులు అన్నామలై ఒంటరిగా స్టాలిన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తీరును ప్రశంసించినట్టు సమాచారం అందింది. దక్షిణ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, పార్లమెంట్‌ సీట్ల సంఖ్య పెంపు పై చర్చలు జరిగినట్టు తెలిసింది. పోలింగ్‌ బూత్‌ లెవెల్‌ లో పార్టీని పటిష్ట పరిచి బూత్‌ కమిటీలు పూర్తీ చేయాలని నేతలకు నడ్డా ఆదేశించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్‌ సంతోశ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి, ఏపీ అధ్యక్షులు డి.పురందేశ్వరి, తమిళనాడు, కర్నాటక, పలు రాష్ట్రాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఈటల, డీకే అరుణ, ఎంపీ లక్ష్మణ్‌, బండి కూడా పాల్గొన్నట్టు తెలిసింది. ఆ సమావేశం అనంతరం నోవాటెల్‌లో బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

Spread the love