పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం

–  మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి
–  తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌-475 ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పోరాటాల ద్వారా సమస్యలు పరిష్కారమవు తాయని, అందుకు కాంట్రాక్టు లెక్చరర్ల 22 ఏండ్ల నుంచి చేసిన పోరాటమే నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర 475 అసోసియేషన్‌ రాష్ట్ర విస్తతస్థాయి సమావేశం టీఎస్‌యూటీఎఫ్‌ కార్యాలయంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జి.శ్రీనివాస్‌ అధ్యక్షతన ఆది వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22ఏండ్ల పోరాట ఫలితంగా కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్లను క్రమబద్ధీకరించడం విప్లవాత్మకమైన మార్పు అని అన్నారు. తక్కువ వేతనంతో ఉద్యోగంలో చేరారని, చాలా మంది తక్కుత జీతానికి పనిచేయలేక వెళ్లిపోయారని గుర్తుచేశారు. కాంట్రాక్టు లెక్చరర్లు జీతభత్యాలతో సంబంధంలేకుండా పేద విద్యార్థులకు విద్యనందించడమే లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. రెగ్యులరైజేషన్‌ గురించి పలుమార్లు సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రితో చర్చించామని తెలిపారు. సమస్యలతోపాటు విద్యాపరిరక్షణకు లెక్చరర్లందరూ కృషి చేయాలని అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్‌ అందె సత్యం మాట్లాడుతూ జూనియర్‌ కాలేజీలను బలోపేతం చేసేందుకు లెక్చరర్లు కృషిచేయాలని అన్నారు. కార్పొరేట్‌ కాలేజీలకు ధీటుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిజాయతీ, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలని, సంఘం పేరు చెప్పుకుని కాలేజీలకు ఆలస్యం రాకూడదని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికే కాకుండా చదువు బాగా చెప్పడానికీ ఓ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మిగిలిన కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు కలిసిరావాలని కోరారు. తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించడం చారిత్రక నిర్ణయమని అన్నారు. ఈ నిర్ణయంతో సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు.2000 నుంచి ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తూ కాలేజీల అభివృద్ధి ఎంతో కృషిచేశామని చెప్పారు.
టీజీజేఎల్‌ఏ ఏర్పాటు
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత విద్య పరిరక్షణకు , కాంట్రాక్టు లెక్చరర్ల హక్కుల కోసం పనిచేసిన కాంట్రాక్టు అధ్యాపకుల 475 సంఘాన్ని ‘తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల అసోసియేషన్‌-475’ మారుస్తూ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఏక గ్రీవంగా తీర్మానం చేసినట్టు ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ తెలిపారు. ‘ప్రభుత్వ ఉన్నత విద్యను పరిరక్షణకు కృషిచేయాలి. క్రమబద్ధీకరణ కానీ కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే క్రమబద్ధీకరించాలి. నూతన అధ్యాపకులకు సంబంధించి సర్వీసు ప్రొటక్షన్‌ కల్పించాలి. అన్ని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల విద్యార్థుల హస్టల్‌ వసతి కల్పించాలి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల నిర్వహణకు నిధులు కేటాయించాలి.

Spread the love