విద్యారంగ సమస్యల పరిష్కారానికి

– 12న పాఠశాలలు,ఇంటర్‌ కళాశాలల బంద్‌
– లెఫ్ట్‌ స్టూడెంట్స్‌ యూనియన్స్‌ పిలుపు
– బంద్‌ పోస్టర్‌ ఆవిష్కరణ.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలల బంద్‌ నిర్వహిస్తున్నట్టు, ఈ బంద్‌లో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంద్‌ పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎల్‌.మూర్తి, టి.నాగరాజు(ఎస్‌ఎఫ్‌ఐ), పుట్టాలక్ష్మణ్‌, మణికంఠరెడ్డి(ఎఐఎస్‌ఎఫ్‌), పరుశరాం (పీడీఎస్‌యూ), మహేష్‌(పీడీఎస్‌యూ), రామకష్ణ(పీడీఎస్‌యూ), గవ్వవంశీధర్‌ రెడ్డి(ఎఐఎస్‌బీ), విజరు(పీడీఎస్‌యూ విజంభణ) మాట్లడారు. రాష్ట్రంలో కార్పోరేట్‌, ప్రయివేట్‌ ఫీజులు దందా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం వాటి నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. మంత్రులు ఉపసం ఘం, తిరుపతిరావు కమిటీ రిపోర్ట్‌ బహిర్గతం చేయకపోవడం చూస్తే ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా వ్యవరిస్తున్నట్టుగా ఉందన్నారు. విద్యాసంవ త్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా యూనిఫామ్స్‌ ఇవ్వలేదని, కొన్ని టైటిల్స్‌ పాఠ్యపుస్తకాలు పంపలేదని, చదువులు చెప్పే టీచర్లు లేరని, పారిశుద్ధ్య కార్మికులు లేరని, అనేక సమస్యలతో విద్యాసంవత్సరం ప్రారంభమైన నిర్ధిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. తాగునీరు, మధ్యాహ్న భోజనం బిల్లుల పెండింగ్‌, ముత్రశాలలు, సరైన మౌళిక సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యారంగం గొల్లుమంటుందన్నారు. మనఊరు-మనబస్తీ-మనబడి నిధులతో గుత్తేదారులు తూతూమంత్రంగా మాత్రమే పనులు చేశారని విమర్శించారు. ఎక్కడా సరిగ్గా పాఠశాలలకు ఉపయోగ పడలేదన్నారు. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ అందని ద్రాక్షగా మారిందని తెలిపారు. ఇంటర్‌ విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు ఇంకా అందివ్వలేదని చెప్పారు. లెక్చరర్స్‌ లేరని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో నాలుగేండ్ల నుంచి ఫీజు రీయింబర్స్‌ మెంట్స్‌, స్కాలర్‌షిప్స్‌ రూ.5,177 కోట్లు పెండింగులో ఉన్నాయ ని, వాటిని కనీసం విడుదల చేయడం లేదని చెప్పారు. గురుకులాలు, కేజీబీవీలు, ఇంటర్‌ కళాశాలలుగా అఫ్‌ గ్రేడ్‌ చేసినవాటికి భవనాలు లేక అరకొర సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయని వివరించారు. వాటికి నిధులు లేవని, లెక్చరర్స్‌, టీచర్స్‌ లేరని అన్నారు. నాణ్యమైన భోజనం లేక పుడ్‌ ఫాయిజన్‌ సంఘటనలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో టీచర్‌, లెక్చరర్స్‌ పోస్టులు ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదన్నారు. ఒక్క డిఎస్సీ ఇప్పటివరకు వేయలేదని తెలిపారు. అందుకే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కదిలించి బంద్‌ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు. అన్ని జిల్లాలో బంద్‌ విజయవంతం చేయాలని విద్యార్ధి లోకానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి, ఈ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో అశోక్‌రెడ్డి, సంతోష్‌, లెనిన్‌, స్టాలిన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) క్రాంతి, నరేష్‌(ఎఐఎస్‌ఎఫ్‌), రియాజ్‌(పీడీఎస్‌యూ), సుమంత్‌(పీడీఎస్‌యూ) తదితరులు పాల్గొన్నారు.

Spread the love