ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేయాలి
సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ విడుదల చేయాలనీ, ఉద్యో గులకు పీఆర్సీని ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. జిల్లా ల్లో రెండు నెలలుగా పెన్షన్ ఇవ్వకపోవ డం దారుణమని పేర్కొ న్నారు. ఉద్యోగ విరమణ రోజే రిటైర్డ్ బెనిఫిట్స్ ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 460 మంది ఉద్యోగుల పెన్షన్ ఫైళ్లు ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయనీ, మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వివరించారు.
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పథకాన్ని నిర్వీర్యం చేసి వారికి వైద్యసేవలు అందకుండా చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ నెలాఖరుతో మొదటి పీఆర్సీ గడువు ముగియబోతున్నదనీ, వచ్చే నెల నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉండగా ఇంత వరకు కమిషన్ నియమించకపోవడమేంటని ప్రశ్నించారు. మీకు ఓట్లు, సీట్లే తప్ప ప్రజల బాగోగులు పట్టదా అని ప్రశ్నించారు. ఒకవేళ ఓట్ల కోణంలో ఆలోచించినా పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు రాష్ట్రంలో 30 లక్షలకు పైనే ఉన్నాయనే విషయాన్ని విస్మరించడం శోచనీయమని పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల పోరాటాలకు బీజేపీ అండగా ఉంటుందని హామీనిచ్చారు.