– ఈటలతో నాకు గ్యాప్‌లేదు
– కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కి చుట్టరికం ఉంది
– పేరు, వాస్తు మార్చుకున్నా అధికారంలోకి రాలేరు : జితేందర్‌రెడ్డి
– ఈటల, జితేందర్‌రెడ్డితో గవర్నర్ దత్తాత్రేయ ప్రత్యక్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ట్వీట్ అంటేనే ట్విస్ట్ అనీ, దున్నపోతుల ట్వీట్‌కు ఎక్సప్లనేషన్ ఉండదని మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఈటలతో తనకు గొడవ లేదనీ, ఆయనకు ఏ పదవి వచ్చినా సంతోషిస్తానని అన్నారు. సోమవారం హైదరాబాద్ శివారులోని జితేందర్‌రెడ్డి ఫామ్‌హౌజ్ సాక్షిగా ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి ఒక్కటయ్యారు. వారిద్దరితో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశమైంది. వారిద్దరి మధ్య ఆయనే సయోధ్య కుదిర్చినట్టు కూడా ప్రచారం జరుగుతున్నది. ఈ భేటీ అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పేరు మార్చుకున్నా, వాస్తు మార్చుకున్నా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య చుట్టరికం ఉందని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గెలిచే దమ్మున్న పట్టుమని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు చెప్పాలని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరన్నారు. రేవంత్‌రెడ్డి ఫోన్‌చేసి ట్వీట్ బాగుందని చెప్పారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలుపు కోసం పనిచేశామని తెలిపారు. బీజేపీ పై తప్పుడు ప్రచారాలను ఆపాలని మీడియాను కోరారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. తాను పదవుల కోసం ఢిల్లీకి వెళ్లనన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలతోనే ఉంటాననీ, అధిష్టానం ఎక్కడ పోటీచేయాలని చెబితే అక్కడ చేస్తానని చెప్పారు. గవర్నర్ దత్తాత్రేయ చేవెళ్ల వెళ్తుండగా తన ఇంటికి వచ్చారన్నారు.
ఈ విషయాన్ని ముందే చెప్పడంతో ఈటల రాజేందర్, విజయరామారావు కూడా వచ్చారని చెప్పారు.