ప్రజల పైసలతో మహారాష్ట్రలో కేసీఆర్‌ హంగామా : బీజేపీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రజల పైసలతో సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రలో హంగామా చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధులు సంగప్ప, విఠల్‌, కట్టా సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కార్లలో ప్రజల సొమ్ముతో డీజిల్‌ పోసుకొని బీఆర్‌ఎస్‌ జెండా కట్టుకుని పోవడానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు. 14 మంది మంత్రులు ఆయన వెంట వెళ్తే రాష్ట్రంలో పాలన పరిస్థితేంటని నిలదీశారు. మంత్రుల్లో కొందరు కేసీఆర్‌ కుటుంబానికి బానిసలుగా మారారని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో 1300 మందికిపైగా అమరులైతే కేవలం 600 కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయం చేశారన్నారు. మిగతా అమరుల కుటుంబాలను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. జానకీపురం సర్పంచ్‌ నవ్యపై ఎమ్మెల్యే రాజయ్య వేధింపులకు పాల్పడితే కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ బీసీలకు రూ. లక్ష సాయం పేరుతో మోసం చేస్తున్నారని విమర్శించారు. బీసీల్లో ఎన్నో కులాల వారుండగా కొందరికే లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇస్తారని ప్రశ్నించారు.

Spread the love