మోడీ..ఓ విఫల ప్రధాని…

– అత్యధిక నిరుద్యోగం సృష్టించిన ఘనత ఆయనదే
– బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా
– ఉడత ఊపులకు భయపడబోమంటూ వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నరేంద్ర మోడీ.. దేశ చరిత్రలో అత్యంత విఫల ప్రధానిగా మిగిలిపోయారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. తొమ్మిదేండ్లలో అత్యధిక నిరుద్యోగం సృష్టించిన ఘనత ఆయనకే దక్కుతుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ వరంగల్‌ సభలో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని యువత కోసం చేసిన ఒక్క మంచిపనినైనా చెప్పాలంటూ మోడీకి.. ఆయన సవాల్‌ విసిరారు. గుజరాత్‌ కోసం రూ.20 వేల కోట్ల పెట్టుబడితో లోకోమోటివ్‌ ఫ్యాక్టరీని తన్నుకుపోయిన పీఎం… తెలంగాణలో కేవలం రూ.520 కోట్లతో వ్యాగన్‌ రిపేర్‌ షాపును పెట్టటం ఇక్కడి ప్రజలను అవమానించటమే అవుతుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్న 16 లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కేంద్రం చోద్యం చూస్తోందని తెలిపారు. ఈ వాస్తవాన్ని మరుగుపరిచిన మోడీ… రాష్ట్రంలో 2.20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై నిందలేయటం శోచనీయమని పేర్కొన్నారు. ఉద్యోగాలడిగితే పకోడీలు వేసుకోవాలంటూ సూచించిన ప్రధాని… యువత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం పంపిన యూనివర్సిటీల బిల్లును ఆమోదించకుండా చోద్యం చూస్తున్న గవర్నర్‌ను పీఎం మందలిస్తే బావుండేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన హామీల్లో కీలకమైన గిరిజన విశ్వ విద్యాలయ ఏర్పాటు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నల్లచట్టాలతో 700 మంది రైతులను పొట్టనబెట్టుకున్న పీఎం… వ్యవసాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. తమది కుటుంబ పాలన అంటూ మోడీ వ్యాఖ్యా నించటాన్ని కేటీఆర్‌ ఈ సందర్భంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజలంతా తమ కుటుంబ సభ్యులనీ, వారి సర్వతోముఖాభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరిపిస్తామంటూ ప్రధాని హెచ్చరించటంపై కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు తమ ప్రభుత్వం కలవరపడబోదని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వాటిని నెరవేర్చటం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు.

Spread the love