అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి అదృశ్యమయ్యాడు. తాజాగా ఓ తెలుగు విద్యార్థి షికాగోలో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ లేదని అక్కడి భారత రాయాబార కార్యాలయం వెల్లడించింది. భారత్‌కు చెందిన విద్యార్థి రూపేశ్‌ చంద్ర చింతకింది మే 2వ తేదీ నుంచి కన్పించట్లేదని తెలిసినట్లు ఇండియన్ కాన్సులేట్‌ తెలిపింది. అతడి ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. త్వరలోనే రూపేశ్‌ జాడ తెలుస్తుందని ఆశిస్తున్నామంటూ షికాగోలోని భారత రాయబార కార్యాయలం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. మరోవైపు పోలీసులు కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. అతడి గురించి తెలిస్తే సమాచారం అందించాలని స్థానికులను కోరారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రూపేశ్‌ ప్రస్తుతం విస్కాన్సిన్‌లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నాడు. అతడు అదృశ్యమైనట్లు తెలియగానే కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను, అమెరికా ఎంబసీని అభ్యర్థించారు.

Spread the love