విభజన చట్టం హామీలపై.. మాట తప్పిన మోడీ క్షమాపణ చెప్పాలి

– 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌కు విమర్శించే హక్కులేదు
– మహబూబాబాద్‌లో 24,181 మందికి పోడు పట్టాలు : మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
విభజన చట్టంలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఇవ్వనందుకు ప్రధాని మోడీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) డిమాండ్‌ చేశారు. శుక్రవారం మహబూబాబాద్‌ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఎన్టీఆర్‌ స్టేడియంలో పోడు భూముల పట్టాలను సాగుదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ శశాంక అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. విభజన చట్టంలో ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 360 ఎకరాలు కేటాయించినా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నియోజకవర్గంలోని బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సి ఉండగా తొమ్మిదేండ్లయినా ఏర్పాటు చేయలేయకపోవడం దారుణమన్నారు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వకపోగా.. గుజరాత్‌లో రూ.21వేల కోట్లతో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి బదులు రైళ్లను మరమ్మతులు చేసే షెడ్‌ను మనకు మంజూరు చేశారని, దీని శంకుస్థాపనకు ప్రధాని వస్తున్నారన్నారు. గుజరాత్‌కు ఒక న్యాయం, మనకో న్యాయమా అని ప్రశ్నించారు. మీరు గుజరాత్‌కు మాత్రమే ప్రధాని కాదని, దేశానికి ప్రధాని అని గుర్తు చేశారు. కొమురం భీం ఒకనాడు జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం పోరాటం చేశారని, ఆయన కలను నేడు గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టా పాసుపుస్తకాలు ఇవ్వడం ద్వారా సాకారం చేశామని తెలిపారు. ‘జల్‌’ విషయంలో ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కాలంతో పోటీపడుతూ నీళ్ల సమస్యను పరిష్కరించారన్నారు. జంగల్‌ విషయంలో హరితహారం కార్యక్రమం ద్వారా ఈ తొమ్మిదేండ్లలో 240 కోట్ల మొక్కలను నాటి 5.13 లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని విస్తరించామన్నారు. ఇక జమీన్‌ విషయంలో.. ఈ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1.50లక్షల మందికి 4లక్షల ఎకరాల పోడు భూముల్లో పట్టాలిస్తున్నామని తెలిపారు. ఒక్క మహబూబాబాద్‌ జిల్లాలోనే 67,730 ఎకరాల్లో 24,181 మంది గిరిజనులకు పట్టాలిచ్చినట్టు చెప్పారు. ఈ పట్టాలతో ప్రభుత్వ పథకాలైన రైతు బంధు, రూ.5లక్షల రైతు బీమా వారికి వర్తిస్తాయని, ఈ నెలలోనే రైతు బంధు కింద రూ.68కోట్ల నిధులు గిరిజన రైతుల ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. అలాగే, రాష్ట్ర ఏర్పాటుకు ముందు పదేండ్లలో 26 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తే, రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం ఈ తొమ్మిదేండ్లలో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 80 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్నారు. ఇటీవల మహబూబాబాద్‌లో పాదయాత్ర చేసిన కాంగ్రెస్‌ నేత భట్టి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ప్రస్తావిస్తూ 50 ఏండ్లు పాలించి ఏం చేశారని, ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసోళ్ల మాటలు వింటే చక్కెరొచ్చి పడిపోతారని, రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తరంట.. అధికారం కోసం హామీలపై హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు, ప్రభుత్వ అధికారులు, పోడు రైతులు పాల్గొన్నారు.

Spread the love