మణిపూర్‌లో చల్లారని హింస

– తాజా అల్లర్లలో నలుగురు మృతి
– మృతుల్లో ఒక పోలీసు
– రాష్ట్రంలో ఇప్పటికీ అదుపులోకి రాని శాంతిభద్రతలు
ఇంఫాల్‌ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అల్లర్లు తగ్గుముఖం పట్టటం లేదు. రాష్ట్రంలో గత 24 గంటల్లో బిష్ణుపూర్‌, చురచంద్‌పూర్‌ జిల్లాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు సంఘటనలలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక పోలీసు, మరొక యువకుడు ఉన్నారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. కిందటి రోజు సాయంత్రం అనుమానిత ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో పోలీసు మరణించగా, ఉదయం మరో ముగ్గురు మరణించారు. గత రెండు నెలలుగా ఈ రెండు జిల్లాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో హత్యలు, హింస, దహన ఘటనలు పెరిగాయి.ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం.. బిష్ణుపూర్‌ జిల్లా పరిధిలోని కంగ్వారు ప్రాంతం రెండు వర్గాలకు దగ్గరగా ఉండటంతో అది సున్నితమైన ప్రాంతంగా ఉన్నది. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ‘బఫర్‌ జోన్‌’ను సష్టించాయి. పరిస్థితిని తీవ్రతరం చేయకుండా నిరోధించడానికి భారీ సంఖ్యలో బలగాలు మోహరించాయి. అయితే రెండు వైపుల నుంచి దుండగులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడానికి కొండ ప్రాంతాలు, లోయ ప్రాంతాల్లోని గ్రామాల గుండా చొరబడతారు. ”శుక్రవారం రాత్రి నుంచి రెండు వైపుల నుంచి ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఈ గుంపులు బయటి నుంచి గుమిగూడాయి. తిరిగి వెళ్లాలన్న స్థానికుల అభ్యర్థనకు వారు లొంగలేదు. భద్రతా దళాలు సంయుక్తంగా ప్రతిస్పందించాయి. అయితే, కాంగ్వారు, సాంగ్డో, అవాంగ్‌ లేఖారు గ్రామాల నుంచి స్టాండ్‌-ఆఫ్‌ పరిధుల నుంచి ఇరు పక్షాల దుండగులు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మతి చెందడంతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి” అని గ్రౌండ్‌ ఆపరేషన్‌లో పాల్గొన్న సీనియర్‌ భద్రతా అధికారి తెలిపారు.బలగాలు మోహరించినా రాష్ట్రంలోని కొన్ని చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నది. కాల్పుల సంఘటనలు నివేదించబడ్డాయి. గత 24 గంటలుగా కొన్ని చోట్ల గుంపులు గుమిగూడడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంఫాల్‌ ఈస్ట్‌, ఇంఫాల్‌ వెస్ట్‌, చురచంద్‌పూర్‌, బిష్ణుపూర్‌, కక్చింగ్‌ జిల్లాల్లో దుండగులు, ఉగ్రవాదులు ఏర్పాటు చేసిన 18 అక్రమ బంకర్‌లను శుక్రవారం మణిపూర్‌ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాల సంయుక్త బందం ధ్వంసం చేసింది. గడిచిన 24 గంటల్లో దాదాపు 50 అక్రమ బంకర్లను ధ్వంసం చేశారు. గత 24 గంటల్లో, ఇంఫాల్‌ తూర్పు జిల్లాలో ఐదు అధునాతన ఆయుధాలు, 74 రకాల మందుగుండు సామగ్రి మరియు ఐదు అత్యంత పేలుడు హ్యాండ్‌ గ్రెనేడ్‌లు స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్‌లోని వివిధ జిల్లాల్లో కొండ, లోయలో సుమారు 126 చెక్‌పాయింట్లు ఏర్పాటు చేశారు.వివిధ జిల్లాల్లో చట్టాలను ఉల్లంఘించినందుకు 270 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో పరిస్థితి అధ్వాన్నం
మణిపూర్‌ మాజీ గవర్నర్‌ ఆందోళన
న్యూఢిల్లీ: మణిపూర్‌ మాజీ గవర్నర్‌ గుర్బచన్‌ జగత్‌ మణిపూర్‌లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వార్తసంస్థతో ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లో నెలకొన్న ఘర్షణల కంటే ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నదని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌లో ఐపీఎస్‌ అధికారిగా ఆయన పని చేశారు. ” రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్‌లు, పోలీసు ఆయుధాల మీద దాడులు జరిగాయి. వేలాది తుపాకీలు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని దోచుకున్నారు. ఇలా జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌, ఢిల్లీ, గుజరాత్‌లలో కఠిన సమయాల్లోనూ జరగలేదు. దొంగ ఆయుధాలు రాష్ట్ర భద్రతా దళాలకు సవాలుగా కొనసాగుతాయి” అని ఆయన హెచ్చరించారు.

Spread the love