ట్రాక్టర్‌ నడిపి.. నాట్లు వేసి…

– హర్యానా రైతులతో రాహుల్‌ ముచ్చట్లు
సోనేపట్‌ : కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ శనివారం హర్యానాలోని సోనేపట్‌ జిల్లా రైతులతో మమేకమయ్యారు. బరోడా, మదీనా ప్రాంతాలలో వ్యవసాయ క్షేత్రాలలోకి వెళ్లారు. కొద్దిసేపు ట్రాక్టర్‌ నడిపారు. రైతులతో కలిసి వరి పొలంలో నాట్లు వేశారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌ వెళుతూ మార్గమధ్యంలో ఆయన పంట పొలాల వద్ద ఆగారు. రాహుల్‌ తమ పొలాల్లోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, తొలుత ఆయనను గుర్తించలేదని సంజరు కుమార్‌ అనే రైతు తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారని, తమతో కలిసి అల్పాహారం తీసుకున్నారని చెప్పారు. కాగా రాహుల్‌కు సంఘీభావంగా ఈ నెల 12న మౌనదీక్ష చేపట్టాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్షులకు లేఖలు రాశారు. పరువునష్టం కేసులో రాహుల్‌కు విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు గుజరాత్‌ హైకోర్ట్‌ నిరాకరించిన నేపథ్యంలో ఆయన ఈ లేఖలు రాశారు. రాహుల్‌ వెనుక లక్షలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, కోట్లాది మంది భారత ప్రజలు ఉన్నారని చాటడానికి ఈ దీక్షలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధానులలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు దీనికి హాజరవుతారు.

Spread the love