రైతన్న విజయం

అన్నదాత ఉద్యమానికి దిగొచ్చిన హర్యానా సర్కారు
 అన్ని డిమాండ్లకూ అంగీకారం తెలిపిన ఖట్టర్‌ ప్రభుత్వం
చండీగఢ్‌ : హర్యానాలో రైతులు విజయం సాధించారు. తమ డిమాండ్ల సాధన కోసం వారు చేస్తున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. రైతులు చేసిన అన్ని డిమాండ్లకూ అక్కడి బీజేపీ సర్కారు అంగీకారం తెలిపింది. పొద్దుతిరుగుడు పంటను ఎంఎస్‌పీ పైనే తీసుకుంటామని, జైలులో ఉన్న రైతులను విడుదల చేస్తామని హామీనిచ్చింది. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని విరమించారు. డిమాండ్ల సాధన కోసం హర్యానాలోని కురుక్షేత్రలో రైతులు ఆందోళన చేస్తున్నారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు.
ఈ నిరసనల్లో భాగంగా రెండో రోజు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. రైతులకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఇది తమ పోరాట విజయమని రైతులు తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధిగా డిప్యూటీ కమిషనర్‌ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పొద్దుతిరుగుడు పంటను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి (క్వింటాల్‌కు రూ. 6,400) తీసుకుంటామని ప్రకటించారు. ఇందుకోసం మండీలలో రేటు పెంచడంతో పాటు భవన్‌ల మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచనున్నదన్నారు. జిల్లా ఎస్పీ సురేంద్ర భదౌరియా కూడా నిరసన స్థలానికి చేరుకుని జైలులో ఉన్న రైతులను అవసరమైన చర్యల తర్వాత విడుదల చేస్తామని హామీఇచ్చారు.
కేంద్రంలోని మోడీ సర్కారు వివాదాస్పద సాగుచట్టాలతో రైతుల జీవితాలతో ఆడుకున్నది. మోడీ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దిగారు. దీంతో కేంద్రం ఆ వివాదాస్పద సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. ఇటు మహారాష్ట్రలోనూ రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ఏఐకేఎస్‌ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన మహార్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొక బీజేపీపాలిత రాష్ట్రమైన హర్యానా కూడా తన రైతు వ్యతిరేఖ ధోరణిని బయటపెట్టుకున్నది. దీంతో రాష్ట్రంలోని రైతులు ఉద్యమానికి దిగటంతో ఖట్టర్‌ సర్కారు మెట్టు దిగి.. వారి డిమాండ్లకు అంగీకరించిందని విశ్లేషకులు తెలిపారు. ”మరోసారి రైతులు గెలుపొందారు. ప్రభుత్వం తలవంచాల్సిందే. బీజేపీ ఇటీవలి సంవత్సరాలలో తన నిర్ణయాన్ని మార్చలేమని చూపించడానికి ప్రయత్నిస్తున్నది. కానీ దేశంలోని రైతులు పదే పదే పోరాటం చేస్తున్నారు” అని వారు చెప్పారు.
ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గత రెండ్రోజులుగా ఎండవేడిమితో రోడ్డుపై కూర్చున్న రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. రైతులు దీనిని మరో విజయంగా భావించారు. డిప్యూటీ కమిషనర్‌ కురుక్షేత్ర స్వయంగా నిరసన స్థలానికి చేరుకొని రైతు నాయకులతో చర్చించారు. రైతు నాయకులు గురునామ్‌ సింగ్‌ చధు, అతని సహచరులను విడుదల చేయాలనీ..పొద్దుతిరుగుడు పువ్వులను ఎంఎస్‌పీపై కొనుగోలు చేయాలని రైతుల ముఖ్యమైన డిమాండ్‌లు వినిపించారు. అనంతరం ప్రభుత్వం తరఫున డిప్యూటీ కమిషనర్‌ హామీ ఇవ్వటంతో రైతులు తమ నిరసనను విరమించారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) ప్రతినిధి రాకేష్‌ టికాయత్‌మాట్లాడుతూ.. ఇతర పంటలకు ఎంఎస్‌పీ హామీ కోసం దేశవ్యాప్తంగా గణనీయమైన ఉద్యమం జరగాలన్నారు. దేశంలో ఎంఎస్‌పీ గ్యారెంటీ యాక్ట్‌ అమలులోకి వచ్చినపుడే అంతిమ విజయమని పంజాబ్‌ రైతు నాయకుడు సుర్జిత్‌ సింగ్‌ ఫూల్‌ తెలిపారు.

Spread the love