అంతా మోడీనే..

– గజ మాలలు, గ్రూప్‌ ఫోటోలతో ఎన్డీఏ భేటీ
– 38 పార్టీలు హాజరు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
”పేరుకే ఎన్డీఏ భేటీ. అంతా మోడీయే… మోడీకి గజ మాల…. ఆయనను సత్కరించడంలోనే నేతలు తలమునకలు… ఆయనే నాయకుడు. అక్కడ ఎన్డీఏ కన్వీనర్‌ ఎవరో ఎవరికీ తెలియదు. అందరూ గ్రూప్‌ ఫోటో దిగారు” . బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తీరిది. ప్రతిపక్షాల సమావేశానికి పోటీగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని అశోక హౌటల్‌లో మంగళవారం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 38 పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన 38 పార్టీలలో చాలా వరకు చిన్న మిత్ర పక్షాలే ఉన్నాయి. కొన్ని పార్టీలకు ఒక్క ఎంపీ కూడా లేరు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ తమది సమయం పరీక్షించిన కూటమి అని అన్నారు. ఎన్డీఏ ప్రాంతీయ ఆకాంక్షల అందమైన ఇంద్రధనస్సు అని, ఇది బలవంతపు కూటమి కాదని అన్నారు. ” ఎన్డీఏ సంకీర్ణం బలవంతం చిహ్నం కాదు. సంకీర్ణం, సహకారం చిహ్నం. ఎన్డీఏలో ఏ పార్టీ చిన్నది లేదా పెద్దది కాదు. మనమందరం ఒకే లక్ష్యం వైపు కలిసి నడుస్తున్నాం” అని ప్రధాని మోడీ అన్నారు. రాజకీయాల్లో పోటీ ఉండాలి కానీ నాయకులు శత్రువుల్లా ప్రవర్తించకూడదని అన్నారు. ప్రతిపక్షాల ఏకైక గుర్తింపు ‘ ఎన్డీఏ’ను దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అవినీతిని అన్ని విధాలుగా నిలిపివేసిందని, ప్రభుత్వ పథకాల లీకేజీని అరికట్టిందని అన్నారు. ”ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సానుకూల రాజకీయాలు చేశాం. ప్రతిపక్షంలో మేము అప్పటి ప్రభుత్వాల కుంభకోణాలను బయటపెట్టాము. కానీ, ప్రజల తీర్పును ఎప్పుడూ అవమానించలేదు. పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేం ఎప్పుడూ విదేశీ శక్తుల సహాయం తీసుకోలేదు. దేశానికి ఉద్దేశించిన అభివృద్ధి పథకాల్లో మేం ఎప్పుడూ అడ్డంకులు సృష్టించలేదు” అని అన్నారు. ఎన్డీఏ అంటే ఎన్యూ ఇండియా, డెవలప్‌మెంట్‌, ఎఆస్పిరేషన్‌ అని ప్రధాని మోడీ అన్నారు. ఈ సమావేశంలో జెపి నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితీన్‌ గడ్కరీ (బీజేపీ), నాగాలాండ్‌ సీఎం నీఫియు రియో (ఎడీపీపీ), మేఘాలయా సీఎం కాన్రాడ్‌ సంగ్మా (ఎన్‌పీపీ), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్‌నాథ్‌ షిండే (శివసేన షిండే), పుదుచ్చేరి సీఎం ఎన్‌.రంగస్వామి (ఎఐఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌), అజిత్‌ పవార్‌, ప్రపుల్‌ పటేల్‌ (ఎన్‌సీపీ చీలికవర్గం), అనుప్రియా పటేల్‌ (అప్నాదల్‌), పవన్‌ కళ్యాణ్‌ (జనసేన), పలనీ స్వామి (అన్నాడీఎంకే), దుష్యంత్‌ చౌతాలా (జేజేపీ), థామస్‌ (కేరళ కాంగ్రెస్‌ (థామస్‌)), ఉపేంద్ర సింగ్‌ కుష్వాహా (రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ), ముకేశ్‌ సహానీ (వికాశీల్‌ ఇన్సాన్‌ పార్టీ), జితిన్‌ రామ్‌ మాంఝీ (హిందుస్థానీ అవామ్‌ మోర్చా), చిరాగ్‌ పాశ్వాన్‌ (ఎల్‌జేపీ), రాందాస్‌ అథ్వాలే (ఆర్‌పీఐ), అతుల్‌ బోరా (ఏజీపీ), ప్రకాష్‌ రాజ్‌భీర్‌ (ఎస్‌బీఎస్‌పీ), సంజరు నిషాద్‌ (నిషాద్‌ పార్టీ) తదితరులు పాల్గొన్నారు.

Spread the love