మా గోస వినండి

– మంత్రులు, ఎమ్మెల్యేలకు జీపీ కార్మికుల మొర
– క్యాంపు కార్యాలయాల ముట్టడి
– వర్షంలోనే భారీ నిరసన ర్యాలీలు
– పలుచోట్ల కార్మికులు, నేతల అరెస్ట్‌
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యలు పరిష్కరించాలని, జీతాలు పెంచాలని.. సీఎం హామీని అమలు చేయాలంటూ 13 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు మంగళవారం ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. తమ మొర ఆలకించాలని విన్నవించారు. ఈ సందర్భంగా పలుచోట్ల పోలీసులు కార్మికులు, సీఐటీయూ నాయకులను అరెస్టు చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడించారు. జిల్లా పరిషత్‌ గ్రౌండ్‌లో నుంచి మంత్రి క్యాంప్‌ ఆఫీస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆయన స్పందించి ముఖ్యమంత్రికి లేఖ పంపిస్తామని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో కేపీఎం జూనియర్‌ కళాశాల నుంచి ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో గోడకు వినతిపత్రం అంటించారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే గొంగిడి సునీత నివాసంలో జీపీ కార్మికులు వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా బయలుదేరిన కార్మికులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి, ధనియాకుల శ్రీనివాసు, జేఏసీ జిల్లా నాయకులు తన్నీరు వెంకన్నతోపాటు 100 మంది కార్మికులను అరెస్టు చేసి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. తోపులాటలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు స్వల్పంగా గాయపడ్డారు. నూతనకల్‌ మండలంలో జీపీ కార్మికులు భిక్షాటన చేశారు. కోదాడ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. హుజూర్‌నగర్‌ పట్టణంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం అందజేశారు.
  ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గ్రామపంచాయతీ కార్మికుల దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సందర్శించి సంఘీభావం తెలిపారు. వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్‌ క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. వర్షాన్ని సైతాన్ని లెక్కచేయకుండా కార్మికులు అక్కడే బైటాయించి నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు జీపీ కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఇల్లందులో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించి.. ఎమ్మెల్యే హరిప్రియకు వినతి ఇచ్చారు.
కార్మికులు ర్యాలీగా వెళ్లి ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపూరావును కలిసి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులు తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేస్తున్నారని చెప్పారు. కార్మికుల కష్టం ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టిలో ఉందన్నారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి తీపి కబురు అందుతుందని చెప్పారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అదేవిదంగా కాగజ్‌నగర్‌లో సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప క్యాంపు కార్యాలయాన్ని, ఖానాపూర్‌ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఇంటిని కార్మికులు ముట్టడించారు.
నిజామాబాద్‌లో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వెళ్లకుండా పలువురు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సీఐటీయూ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌తోపాటు పలువురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎడపల్లిలో సమ్మెలో కూర్చున్న కార్మికులను, కారోబార్లు, నాయకులు జంగం గంగాధర్‌ను అరెస్టు చేశారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ఎదుట కార్మికులు, నాయకులు ధర్నా చేపట్టారు.
జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటిని ముట్టడించారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మున్సిపల్‌ పరిధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేసి వినతిపత్రాన్ని అందజేశారు.
పోలీసు పహారాలో పారిశుధ్య పనులు
నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండల కేంద్రంలో పోలీసు పహారాలో ఇతర కార్మికులతో పారిశుధ్య పనులు చేయించారు. కార్మికులను, సీఐటీయూ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సీఐ సతీష్‌, రాజారెడ్డి ఆధ్వర్యంలో కార్మికులను అరెస్టు చేసి ప్రయివేట్‌ కూలీలతో గ్రామంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ఏటిఎస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రయివేటు, ఉపాధి కార్మికులతో అధికార యంత్రాంగం సహకారంతో పారిశుధ్య పనులు చేయించినట్టు తెలిపారు.

 

Spread the love