రివర్స్‌ పంపింగ్‌కు బ్రేక్‌

– 10 రోజుల్లో ఎస్సారెస్పీలో నింపింది 2.6 టీఎంసీలు
– సీఎం కార్యాలయ ఆదేశాలతో కాళేశ్వర్‌ నీటి పంపింగ్‌ నిలిపివేత
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం జలాల రివర్స్‌ పంపింగ్‌ను ఆపేశారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్న ముప్కాల్‌ పంప్‌హౌస్‌ మోటార్లను ఆపారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో సోమవారం పంపింగ్‌ నిలిపివేశారు. ఈనెల 7వ తేదీన లాంఛనంగా కాళేశ్వరం జలాలను ముప్కాల్‌ పంప్‌హౌస్‌ ద్వారా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం ప్రారంభించారు. ఈ పది రోజుల్లో పంపింగ్‌ ద్వారా శ్రీరాంసాగర్‌లోకి 2.6 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్టు పంప్‌హౌస్‌ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో 30.147 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి ఎగువ ప్రాంతం నుంచి ఉదయం 20 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా.. సాయంత్రానికి 15 వేల క్యూసెక్కులకు తగ్గింది. ముప్కాల్‌ పంప్‌హౌస్‌ ద్వారా సోమవారం మధ్యాహ్నం వరకు 4350 క్యూసెక్కుల మేర నీటిని ఎత్తిపోశారు. సాయంత్రానికి పంపింగ్‌ నిలిపివేశారు. రోజూ అర టీఎంసీ నీటిని ప్రాజెక్టులోకి విడుదల చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించినప్పటికీ.. రోజుకు 0.2 నుంచి 0.3 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే పంప్‌లను నడిపారు. పంప్‌హౌస్‌ నుంచి కాళేశ్వరం నీటిని విడుదల సమయంలో ప్రాజెక్టులో నీరు 20.89 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ప్రస్తుతం అది 30.14 టీఎంసీలకు పెరిగింది. పంప్‌హౌస్‌ నుంచి 2.6 టీఎంసీ నీరు ప్రాజెక్టులో చేరగా.. 6.65 టీఎంసీల నీరు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరింది.
రివర్స్‌ పంపింగ్‌ నిలుపుదలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ‘వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వానాకాలం సాగు కోసం 40 టీఎంసీలు అవసరమవుతాయనే అంచనాతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా రివర్స్‌ పంపింగ్‌ స్టార్ట్‌ చేశాం. ప్రస్తుత రివర్స్‌ పంపింగ్‌ నీటితో, వరద నీటి ద్వారా ఎస్సారెస్పీ నీటి మట్టం 30 టీఎంసీలకు చేరుకున్నది’ అని వెల్లడించారు. వర్షాకాల సాగుకు రైతులకు సాగునీటికి ఢోకా లేదని తెలిపారు. పైగా ‘కాళేశ్వరం జలాలు రోజుకు అర టీఎంసీ చొప్పున పది రోజులుగా ఎస్సారెస్పీలోకి నింపామని’ మంత్రి ప్రకటనలో పేర్కొన్నారు. రెండు, మూడు రోజులుగా ఎస్సారెస్పీ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం.. ప్రాజెక్ట్‌లోకి ఎగువ నుంచి వరద నీరు చేరుతుండటంతో పంపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. కొద్ది రోజులపాటు వర్షాలు, ఎగువ నీటిని అంచనా వేసి అవసరం ఉంటే మళ్ళీ రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నీటిని నింపే ప్రక్రియ పున:ప్రారంభిస్తామని ప్రకటించారు.

Spread the love