– చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి : పీడీఎస్‌యూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వెంకన్న కోచింగ్ సెంటర్ నడుపుతున్న వెంకన్నను ఉద్యోగం నుంచి తొలగించి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి మహేష్, ప్రధాన కార్యదర్శి ఎస్వీ శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెంకన్న కోచింగ్ సెంటర్ గత పదేండ్లుగా హైదరాబాద్‌లోని విద్యానగర్ వద్ద హిందీ మహావిద్యాలయ పక్కన నడుపుతున్నారని తెలిపారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి అని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా విధుల్లో ఉన్నారని వివరించారు. ప్రభుత్వ లెక్చరర్‌గా ఆయన విధులను నిర్వహించకుండా, అక్కడి విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా పేద, బడుగు, బలహీన వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన ఏ ఇతర ప్రయివేటు విద్యాసంస్థల్లోగానీ, కోచింగ్ సెంటర్లో గానీ బోధించరాదని తెలిపారు. కానీ ఆయన ప్రభుత్వ విధులను నిర్వహించకుండా ప్రయివేట్ కోచింగ్ సెంటర్ పెట్టి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దానికి ఎటువంటి అనుమతుల్లేవని తెలిపారు. అయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, విద్యార్థుల దగ్గర రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. గత పదేండ్లుగా ఆయన ప్రభుత్వ ఉద్యోగ విధులకు హాజరవ్వకుండా, ప్రయివేట్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నా ఉన్నతాధికారులు చూసీ చూడనట్టు ఉంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంకన్నను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తూ రూ.కోట్లు అక్రమంగా సంపాదించిన వెంకన్నపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే పెద్దఎత్తున దశలవారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.