వారిని ‘ఇతరులు’గా చూపిస్తూ రాజకీయ లబ్ది మోడీ పన్నెండేండ్ల పాలనలో ఇదే తీరు
మతమే ప్రధాన ఎజెండాగా పాలిటిక్స్ – మైనారిటీల ప్రాతినిధ్యాన్ని క్రమంగా అంచులకు నెట్టేస్తున్న బీజేపీ
అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంస్థల నివేదికలతో సుస్పష్టం
హెచ్చరిస్తున్న మేధావులు, పౌర సంఘాల నాయకులు
భారత రాజకీయాల్లో ముస్లింలను ‘ఇతరులు’గా చూపిస్తూ మెజారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలన్న ‘విభజన వ్యూహం’ గత పన్నెండేండ్ల బీజేపీ పాలనకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో మత విభజన కుయుక్తులను రాజకీయ లాభాల కోసం వ్యవస్థీకృతంగా ఉపయోగిస్తోందన్న ఆరోపణలను రాజకీయ విశ్లేషకులు, పౌరహక్కుల సంఘాలు ప్రస్తావిస్తున్నాయి. బీజేపీ పాలనలో అనుసరిస్తున్న ఈ విధానాలు దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదానికి చాలా ప్రమాదకరమనీ, ఇవి దేశ భవిష్యత్తునే ముప్పులోకి నెట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని పాలన ముస్లింలను టార్గెట్‌గా చేసుకుంటూ సాగుతున్నది. ముఖ్యంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా బీజేపీ సర్కార్ల చర్యలు కనిపిస్తున్నాయి. ముస్లింలను రాజకీయంగా, సామాజికంగా అంచులకు నెట్టే విధానాన్ని కాషాయపార్టీ అనుసరిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మత విభజన, చరిత్ర గురించి పదే పదే ప్రస్తావన, రాజకీయ ప్రాతినిధ్య క్షీణత వంటి అంశాలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని చెప్తున్నారు.
కేరళ సామాజిక చరిత్రను కొందరు విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ కుల వివక్ష తీవ్రంగా ఉన్నప్పటికీ.. హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య ఒక మంచి వాతావరణం ఉండేదని గుర్తు చేస్తున్నారు. శబరిమల అయ్యప్ప స్వామితో ముడిపడిన వావర్ సంప్రదాయం, చర్చిల నిర్మాణంలో హిందూ సాంస్కృతిక ముద్రలు వంటి ఉదాహరణలు ఆ సామాజిక సమన్వయానికి నిదర్శనాలని వారు అంటున్నారు. అయితే ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ముస్లింలపై అనుమానం, అపనమ్మకం పెంచే ప్రయత్నాలు బీజేపీ పాలనలో జరుగుతున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠ్యపుస్తకాల మార్పులు, అధికార కేంద్రీకరణ, భాషా విధానాలు, ఎన్నికల ప్రక్రియలపై వివాదాలు వంటి అంశాలను ఇందుకు ఉదాహరణలుగా చూపిస్తున్నారు.
రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుదల
ముస్లింలు గణనీయ సంఖ్యలో జనాభా కలిగిన రాష్ట్రాల్లో కూడా బీజేపీ తరఫున ముస్లిం ప్రజాప్రతినిధులు లేరనీ, ఇది ఒక ఆందోళనకరమైన విషయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈశాన్య రాష్ట్రం అసోంలో బీజేపీ మూడోసారి విజయం సాధించింది. ఇక్కడ ముస్లిం జనాభా అధికంగా ఉన్నప్పటికీ… ప్రభుత్వంలో వారి ప్రాతినిధ్యం దాదాపుగా లేకపోవడం దీనికి ఉదాహరణగా విశ్లేషకులు వివరిస్తున్నారు. కేంద్ర మంత్రి వర్గంలోనూ ముస్లింలకు ప్రాధాన్యం తగ్గిందని కూడా వారు అంటున్నారు.
పండుగల చుట్టూ ఉద్రిక్తతలు
కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మత రాజకీయాలు తీవ్రమయ్యాయి. ముస్లింలను టార్గెట్‌గా చేసుకుంటూ హిందూత్వ శక్తులు రెచ్చిపోతున్నాయి. మోడీ పాలనలో మతపరమైన ఊరేగింపులు, పండుగలు, ప్రార్థనల సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకోవడం నిత్యకృత్యమయ్యాయి. మైనారిటీ మతస్తులకు చెందిన పండుగల సందర్భంగా హిందూత్వ శక్తులు జరిపే దాడులు, ద్వేషపూరిత చర్యలు దేశంలో లౌకికవాదానికి మచ్చ తెస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం వ్యాపారులపై ఆంక్షలు, వారి ప్రార్థనా స్థలాలపై పరిమితులు, గోరక్షణ పేరుతో ముస్లింలను విలన్లుగా చిత్రీకరించే ఘటనలు మోడీ పాలనలో తరచూ రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయని వారు అంటున్నారు.
ప్రజాస్వామ్యానికి సవాల్
భిన్న మతాలు, భిన్న సంస్కృతులు కలిగి ఉన్నటువంటి భారత్ వంటి దేశంలో రాజకీయ లాభాల కోసం మత విభజనను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి దీర్ఘకాలిక ప్రమాదమని మేధావులు, పౌర హక్కుల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించాలనే తాత్కాలిక ప్రయోజనాల కోసం సామాజిక సామరస్యాన్ని పణంగా పెడితే దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని అంటున్నారు. మత వైవిధ్యాన్ని బలంగా భావించిన భారత రాజ్యాంగానికి అనుగుణంగా అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు, సమాన గౌరవం లభించేలా పాలన సాగాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు.
అంతర్జాతీయ వేదికలపై విమర్శలు
కేంద్రంలోని మోడీ పాలనలో భారత్‌లో చోటు చేసుకుంటున్న ఇలాంటి మత రాజకీయాలపై అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంస్థలు కూడా పలు నివేదికలు విడుదల చేశాయి. మైనారిటీల భద్రత, మీడియా స్వేచ్ఛ, చారిత్రక కథనాలను రాజకీయం చేయడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. కొన్ని నివేదికలు హిందూత్వ రాజకీయాల ప్రభావం దేశ సామాజిక ఐక్యతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సదరు నివేదికలు పేర్కొన్నాయి.



