Tuesday, June 9, 2026
E-PAPER
Homeజాతీయంతొలి ఉద్యోగం కష్టమే!

తొలి ఉద్యోగం కష్టమే!

- Advertisement -

ఐదేండ్ల క్రితంతో పోలిస్తే తగ్గిన అవకాశాలు
పది మందిలో ఏడుగురికి 
కొత్త జాబ్ పొందడం
 కత్తి మీద సామే
దరఖాస్తు చేసినా సంస్థల నుంచి స్పందన రావట్లే : ఇండీడ్‌ ‌ఫ్రెషర్‌ ‌హైరింగ్‌ ‌రిపోర్ట్‌

న్యూఢిల్లీ : దేశంలో ఉద్యోగ మార్కెట్‌‌లోకి అడుగుపెడుతున్న ఫ్రెషర్ల పరిస్థితి కఠినంగా తయారైంది. గత ఐదేండ్లతో పోలిస్తే మరింత క్లిష్టంగా మారిందని తాజా అధ్యయనం వెల్లడించింది. తొలి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతలో 70 శాతం మంది ఉద్యోగం సంపాదించడం కష్టతరమైందని అభిప్రాయపడ్డారు. దరఖాస్తులు పంపిన తర్వాత చాలా సందర్భాల్లో సంస్థల నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదని సర్వే తేల్చింది. ఉద్యోగాల వెబ్‌‌సైట్‌ ‘ఇండీడ్‌’ నిర్వహించిన ‘ఫ్రెషర్‌ ‌హైరింగ్‌ ‌రిపోర్ట్‌’ ఈ విషయాలను వెల్లడించింది. ​ఈ నివేదిక సమాచారం ప్రకారం.. ఉద్యోగ మార్కెట్‌‌లోకి కొత్తగా ప్రవేశిస్తున్న యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 72 శాతం మంది ఎంట్రీ-లెవల్‌ ఉద్యోగాలకే ముందస్తు అనుభవం కోరుతున్నారని చెప్పారు. అలాగే ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన తర్వాత 61 శాతం మంది అభ్యర్థులకు సంస్థల నుంచి స్పందన రావడం చాలా అరుదుగా జరుగుతోందని అధ్యయనం వెల్లడించింది. దీంతో యువతో నిరాశ పెరుగుతోందని నివేదిక పేర్కొంది. సర్వేలో మరో ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. తమ ఆసక్తులు, దీర్ఘకాలిక కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంచుకోవాలనుకున్నప్పటికీ, ఆర్థిక ఒత్తిళ్లు, అవకాశాల కొరత కారణంగా చాలామంది తమ ప్రాధాన్యాలను మార్చు కోవాల్సి వస్తోందని వెల్లడైంది.

​కేవలం 14 శాతం మంది మాత్రమే తమ తొలి ఉద్యోగం తమకు నచ్చిన ఉద్యోగం, కంపెనీ, ప్రాంతంలో లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు 43 శాతం మంది తమ కెరీర్ నిర్ణయాలపై ఆర్థిక ఒత్తిళ్లు, పరిమిత అవకాశాలు ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశించే ముందు అనుభవాన్ని సంపాదించుకునే అవకాశాలు కూడా పరిమితంగానే ఉన్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. చదువుతున్న సమయంలో కేవలం 20 శాతం మందికే వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లు లభించాయని వెల్లడైంది. అలాగే 18 శాతం మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టు లు, క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు, ఫ్రీలాన్స్ అవకా శాలు ఏవీ అందుబాటులో లేవని సర్వే పేర్కొంది.ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న యువతలో 49 శాతం మంది తమను సంస్థలు గుర్తించడం, అవకాశాలు కల్పించడం అతిపెద్ద సవాలుగా భావిస్తున్నారు.

దరఖాస్తులు పంపినా స్పందన రాకపోవడం, పదేపదే తిరస్కరణలు ఎదురుకావడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతిం టోందని వారు చెప్తున్నారు. 64 శాతం మంది యువత వరుసగా దరఖాస్తులు చేయడం, తిరస్కరణలు ఎదుర్కోవడం వల్ల తమ ఆత్మవి శ్వాసం దెబ్బతిందనీ, ప్రేరణ తగ్గిపోయిందని తెలిపారు. ప్రస్తుతం తమ కెరీర్ లక్ష్యాల దిశగా సరైన మార్గంలో ఉన్నామని భావిస్తున్న వారు కేవలం 20 శాతం మంది మాత్రమే కావడం గమనార్హం. ఇండీడ్‌కు చెందిన టాలెంట్ స్ట్రాటజీ అడ్వైజర్ రోహన్ సిల్వెస్టర్ మాట్లాడుతూ.. తొలి ఉద్యోగం కోసం అన్వేషణ యువతకు దీర్ఘకాలికంగా, అనిశ్చితితో కూడిన ప్రక్రియగా మారిందన్నారు. నిరంతర దరఖాస్తులు, ఆలస్యమైన స్పందనలు, రాజీపడాల్సిన పరిస్థితులు యువతపై ఒత్తిడిని పెంచుతున్నా యని చెప్పారు. యువతలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి, వారికి నేర్చుకునే అవకాశాలు కల్పిస్తూ స్పష్టమైన ప్రవేశ మార్గాలను రూపొందించే సంస్థలు భవిష్యత్తులో మెరుగైన ప్రతిభను ఆకర్షించగలవని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -