నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్లోని బేగంపేటలో భారీ చోరీ చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమానగర్లో నివసిస్తున్న శ్రీనాథ్ నాయుడు అనే వ్యక్తి ఇంట్లో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురయ్యాయి. ఇంట్లో భద్రపరిచిన 81 తులాల బంగారం, రూ.14.75 లక్షల నగదు కనిపించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీనాథ్ నాయుడు కుటుంబ సభ్యులు తమ ఇంట్లోని అల్మారాలో దాచిన నగదు, నగలు మాయమైనట్లు ఆలస్యంగా గుర్తించారు. వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనాథ్ నాయుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ చోరీకి పాల్పడింది వారేనా లేక ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.


