నవతెలంగాణ – హైదరాబాద్ : గురజాడ అప్పారావు రచనలు కేవలం సాహిత్యం కోసమే కాదని, సమాజంలో మార్పు తెచ్చేందుకు అవి దోహదపడ్డాయని తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం అధ్యక్షులు ఎం.జె. వినోద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు, రచయితలు, కళాకారులు గురజాడ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆనందాచారి మాట్లాడుతూ, గురజాడ ఆనాడే సృష్టించిన ‘గిరీశం’ లాంటి స్వార్థపూరిత పాత్రలు నేటి రాజకీయ నాయకుల్లోనూ కనిపిస్తున్నాయని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం స్వభావాన్ని మార్చుకుంటూ అటు-ఇటు వ్యవహరించే నాయకులు నేటికీ ఉన్నారని వ్యాఖ్యానించారు. సమాజంలోని చాందసవాదాన్ని, ధనవంతులు చేసే నికృష్టమైన పనులను గురజాడ తన రచనల ద్వారా ఎండగట్టారని గుర్తుచేశారు. గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు చేసిన కృషి ఫలితంగానే నేడు పత్రికలు, సాహిత్యంలో వాడుక భాష (ప్రజా భాష) వాడుకలోకి వచ్చిందని, భాష ప్రజాస్వామ్యీకరణ చెందిందని తెలిపారు.
“దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అని చాటిన మహాకవి గురజాడ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ ఎడిటర్ ఆర్. రమేశ్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ, నాయకులు ఏ. గోవర్ధన్, వేముల ఆనంద్, కొండూరి భాస్కర్, ప్రభాకర్, మారన్న, సంతోషి, ఐలు, ఆశన్న, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.


