Monday, September 21, 2026
E-PAPER
Homeబీజినెస్వెల్నెస్ సంక్షోభాన్ని సూచిస్తున్న ఐవా నివేదిక

వెల్నెస్ సంక్షోభాన్ని సూచిస్తున్న ఐవా నివేదిక

- Advertisement -

– హైదరాబాద్‌ సమీక్షలో భాగమైన ఉద్యోగస్తులలో సుమారు 64% మంది రాత్రి 10 గంటల తర్వాతే తమ చివరి భోజనం చేస్తున్నారని తేలింది
– ఆలస్యంగా రాత్రి భోజనం చేసిన వారిలో, వారి ప్రామాణిక స్థాయిలతో పోలిస్తే, నిద్ర స్కోర్లు తక్కువగాను, మరుసటి రోజు ఉదయం గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగాను ఉన్నట్లు గుర్తించారు
నవతెలంగాణ – హైదరాబాద్
: ప్రపంచంలోనే మొట్టమొదటి టచ్-ఆధారిత మెటబాలిక్ వెల్నెస్ ట్రాకర్ ఐవా (EYVA) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, పట్టణ ప్రాంత భారతీయులలో పేలవమైన జీవక్రియ ఆరోగ్యం (మెటబోలిక్ వెల్నెస్) ఆందోళన కలిగిస్తోంది. వారి జీవనశైలి విధానాలు వారి వెల్-బీయింగ్ మరియు జీవన నాణ్యతపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. ‘ఇండియా వెల్నెస్ ఇండెక్స్ 2026’ పేరిట విడుద చేసిన ఈ నివేదిక, తమ వ్యక్తిగత ప్రామాణిక స్థాయిలతో పోలిస్తే తక్కువ ఆరోగ్య స్కోర్లు కలిగిన వినియోగదారులలో, ఎక్కువసేపు కదలకుండా చేసే రోజువారీ ప్రయాణాలు, రాత్రుళ్లు ఆలస్యంగా అధిక మోతాదులో భోజనం చేయడం, భోజనం తర్వాత తగిన శారీరక శ్రమ లేకపోవడం, రాత్రిపూట ఆలస్యంగా కెఫిన్ ఉన్న పానీయాలు, పదార్థాలు తీసుకోవడం, శారీరక రికవరీకి తక్కువ సమయం ఉండటం వంటి స్పష్టమైన జీవనశైలిలోని లోపాలు, విధానాలను తేటతెల్లం చేసింది.
ఈ నివేదికలో, భారతదేశవ్యాప్తంగా, ప్రధానంగా పట్టణ ప్రాంతాలలోని 30,000 మందికి పైగా ఐవా వినియోగదారుల యొక్క 35 లక్షల రీడింగ్‌ల ద్వారా సేకరించిన జీవక్రియ (మెటబోలిక్), హృదయ సంబంధిత, శ్వాసకోశ వెల్నెస్ కి సంబంధించిన ఇన్‌సైట్లను పొందుపరిచారు.

జాతీయ అలవాటుగా మారిన ఆలస్య రాత్రి భోజనాలు
జాతీయంగా, సుమారు 54% మంది వినియోగదారులు రాత్రుళ్లు 9 గంటల అనంతరమే తమ భోజనాన్ని ఎక్కువ మోతాదులో తీసుకున్నారు. ఈ ధోరణి ముఖ్యంగా మెట్రో నగరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముంబయిలో అత్యంత ఆలస్యంగా రాత్రి భోజనాలు నమోదవగా, ఢిల్లీలో అత్యంత ఎక్కువ ఆలస్యంగా అధిక మోతాదు భోజనాన్ని చేస్తున్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం ద్వారా ప్రతి వ్యక్తి సాధారణ స్థాయిలతో పోలిస్తే నిద్ర నాణ్యత తక్కువగా ఉండటం, మరుసటి రోజు ఉదయం గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇది భారతదేశంలో అత్యంత సాధారణ ఆరోగ్య విధానంగా మారింది.
‘‘దేశవ్యాప్తంగా రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం సర్వసాధారణమైపోయింది. దీనికి సుదీర్ఘ ప్రయాణాలే ప్రధాన కారణంగా ఉన్నప్పటికీ, విస్తృత కుటుంబ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్న ఒక కొత్త ధోరణిని మేము గమనించాము. కుటుంబంలో ఏ ఒక్క ఉద్యోగి ఆలస్యంగా ఇంటికి వచ్చినా, ఇతర సభ్యులు కూడా దానికి అనుగుణంగా తమ భోజన సమయాలను సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇది ఆ ఇంటి దినచర్యపై ఒక గొలుసుకట్టు ప్రభావాన్ని సృష్టిస్తోంది,’’ అని ఐవా వ్యవస్థాపకుడు, సీఈఓ సునీల్ మదికట్ల అన్నారు.

ఒకే రకమైన భోజనం చేసిన దాదాపు మూడింట రెండు కుటుంబాలలో, మరుసటి రోజు ఉదయం వారి గ్లూకోజ్, శారీరక రికవరీ ధోరణులలో తేడాలు కనిపించాయి. ఒకే రకమైన ఆహారం ఇద్దరి శరీరాలపై ఒకే విధంగా ప్రభావం చూపదు. అందుకే అందరికీ ఒకే రకమైన ఆహార సలహాలు ఎందుకు విఫలమవుతున్నాయో, ప్రతి వ్యక్తి వ్యక్తిగత ధోరణులను పరిగణనలోకి తీసుకోవడం ఎందుకు ముఖ్యమో ఇది స్పష్టం చేస్తుంది. అధిక మోతాదులో, ఆలస్యంగా, ఉప్పగా, వేయించిన ఆహారాన్ని తీసుకునే అలవాట్ల వల్ల ప్రతి ముగ్గురు వినియోగదారులలో ఒకరిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉందని తేటతెల్లం కాగా, ఇది ఢిల్లీలో అత్యధికంగా ఉంది.

భోజనం తర్వాత చేసే శారీరక శ్రమ వల్ల గ్లూకోజ్ స్థాయిలు, నిద్ర మెరుగుపడతాయి
భోజనం అనంతరం కదలడం అనేది వ్యక్తిగత ఆరోగ్య పారామితులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని గుర్తించారు. భోజనం తర్వాత చిన్న నడక వంటి ఏదైనా శారీరక శ్రమ చేసిన వారిలో సుమారు 37% మందిలో, భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిలు 12-16% వరకు గణనీయంగా తగ్గాయని, నిద్ర కూడా మెరుగుపడిందని తెలిసింది. అదనంగా, సుమారు 25% మంది వినియోగదారులు కార్బోహైడ్రేట్లు లేదా చక్కెర ఎక్కువగా ఉన్న అల్పాహారం తీసుకున్నట్లు చెప్పగా, ఇది చాలా మందికి వారి మరుసటి ఉదయం యొక్క వెల్నెస్ స్కోర్ ను ప్రభావితం చేసింది.

కెఫిన్ వల్ల కలిగే ఒక అనవసరమైన ధోరణి
సుమారు 40% మంది వినియోగదారులు నిద్రపోయే ఆరు గంటల లోపు కెఫిన్ తీసుకున్నారు. ఆలస్యంగా భోజనం చేయడం, ఆలస్యంగా కెఫిన్ తీసుకోవడం, ఒత్తిడి, భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో కలుషితమైన గాలి వంటి కారణాల వల్ల సుమారు పావు వంతు రాత్రులలో రాత్రిపూట గుండె కొట్టుకునే వేగం పెరిగినట్లు గమనించారు. భారతదేశం వ్యాప్తంగా చాలా మంది రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల వారి జీవక్రియ ఇంకా చురుకుగా ఉన్నప్పుడే పడుకుంటారు. దీని ఫలితంగా వారి శరీరం కోలుకునే విధానాలు సరిగా ఉండవు.

‘‘వెల్నెస్ స్కోర్లు తక్కువగా ఉండటానికి ఒకే ఒక్క కారణం ఉండటం చాలా అరుదు. చాలా తరచుగా, ఇది ఒకదానిపై ఒకటి పేరుకుపోయిన అనేక జీవనశైలి పద్ధతుల కలయిక, ఇది శరీరంపై సంచిత ప్రభావాన్ని సృష్టిస్తుంది. ఒత్తిడి, రాత్రి ఆలస్యంగా అధిక మతదులో భోజనం చేయడం, నిద్రవేళకు ముందస్తుగా కెఫిన్ తీసుకోవడం వంటి కారకాలు రాత్రంతా హృదయ స్పందన రేటును పెంచుతాయని, మరుసటి రోజు ఉదయం జీవక్రియ స్కోర్లను కూడా ప్రభావితం చేస్తుందని గుర్తించారు. ఈ ఫినామినాను మేము ‘మెటబాలిక్ హ్యాంగోవర్’గా వ్యవహరిస్తాము,’’ అని మదికట్ల వివరించారు.

వివిధ నగరాలు, వివిధ ధోరణులు
ఈ డాటాలో అత్యంత స్పష్టమైన ప్రాంతీయ విభజన పర్యావరణ సంబంధమైనది. ఉత్తర భారతదేశం, ముఖ్యంగా పొగమంచు ప్రభావానికి గురైన ప్రాంతాలు, గాలి నాణ్యతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన భారాన్ని మోస్తున్నాయి. ఎక్కువ కాలం పాటు అధిక ఏక్యూఐ (AQI) ఉన్న సమయాల్లో, ఉత్తరాదిలో జీవక్రియ సంబంధిత ఆరోగ్య స్కోర్లు ప్రతివారం తగ్గుతూ, గాలి తేటపడగానే కోలుకున్నాయి.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో, పొగమంచు తీవ్రంగా ఉన్న శీతాకాలపు వారాల్లో బహిరంగ శారీరక కార్యకలాపాలు సుమారు 30% తగ్గాయి. అధిక ఏక్యూఐ ఉన్న రోజుల్లో ఆక్సిజన్ సంబంధిత ఆరోగ్య ధోరణులు తగ్గుముఖం పట్టగా, రాత్రిపూట శ్వాసకోశ శ్రమ, హృదయ స్పందన రేటు ధోరణులు పెరిగాయి. మొత్తం మీద, ఎక్కువ కాలం పాటు పొగమంచు ఉన్న సమయాల్లో వారి జీవక్రియ సంబంధిత ఆరోగ్య స్కోర్లు సుమారు 6–9% తగ్గాయి, గాలి తేటపడగానే కోలుకున్నాయి.

ముంబయిలో లోకల్ ట్రైన్‌లో ప్రయాణించడం ద్వారా కలిగే చురుకైన రోజువారీ కదలిక మెరుగైన శరీర రికవరీకి దారితీయలేదు. సుమారు 52% మంది ప్రధానంగా లోకల్ ట్రైన్ లేదా ప్రజా రవాణా సేవలను వినియోగించుకున్నారు. దీనితో నడక ఎక్కువగా ఉన్నప్పటికీ, రద్దీ సమయాల్లో వారిలో పగటిపూట ఒత్తిడి, హృదయ స్పందన రేటు ధోరణులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అదనంగా, ముంబయి నగరంలో అత్యంత ఆలస్య భోజన పద్ధతులు నమోదయ్యాయి. నమోదైన చివరి భోజనాలలో 64% రాత్రి 9:30 గంటల అనంతరం జరిగాయి.

బెంగళూరులో, 44% మంది వినియోగదారులు పని దినాలలో ఎక్కువసేపు కదలకుండా ప్రయాణాలు చేస్తున్నట్లు లేదా అధిక ప్రయాణ సమయాలను నమోదు చేశారు. దీని ఫలితంగా, అటువంటి రోజులలో వారి రోజువారీ కదలికలు సుమారు 18% తగ్గాయి. అలాగే పగటిపూట ఒత్తిడి, హృదయ స్పందన రేటు ధోరణులు పెరిగాయి. అదేవిధంగా, సమీక్షలో భాగమైన వారిలో సుమారు 10% మంది తమ ఫిసికల్ ఆక్టివిటీ ను పచ్చని ప్రదేశాల (పార్కులు, చెట్లున్న వీధులు, బహిరంగ ప్రదేశాలు) ఆవరణలో చేసారని తేలింది. వారిలో 10 మందిలో 7 మంది ఆ కార్యకలాపాన్ని సానుకూల మానసిక స్థితితో అనుసంధానించారు.

హైదరాబాద్‌లో, డేటా పునరావృతమయ్యే ‘‘మెటబాలిక్ హ్యాంగోవర్’’ ధోరణిని సూచిస్తుంది. హైదరాబాద్ వినియోగదారులలో ఉద్యోగస్థులలో సుమారు 64% మంది తమ చివరి భోజనాన్ని రాత్రి 10 గంటల తర్వాత చాలా ఆలస్యంగా తిన్నారు. దీని ఫలితంగా, మరుసటి ఉదయం గ్లూకోజ్ ధోరణులు, మెటబాలిక్ స్కోర్‌లు తక్కువ స్థిరంగా ఉన్నాయి.

చిన్న మార్పులు, వెల్నెస్ పై పెద్ద ప్రభావం
ఈ సర్వే ఒక ప్రోత్సాహకరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. చిన్నపాటి ప్రవర్తనా మార్పులు చేసుకుని, వాటిని కొనసాగించిన వినియోగదారులలో, మూడు నెలల వ్యవధిలో వెల్నెస్ స్కోర్లు సుమారుగా 8–12% పెరిగాయి. ‘‘పరికరం వల్ల స్కోరు పెరగలేదు,’’ అని మద్దికట్ల స్పష్టం చేవారు. ప్రజలు తమ జీవక్రియ స్కోర్‌లు, కొన్ని జీవనశైలి ఎంపికలకు వారి శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడం ద్వారా ఇది పెరిగింది. ప్రజలు రాత్రి భోజనం త్వరగా చేయడం, కొద్దిసేపు నడవడం, రోజు చివర్లో కెఫిన్‌ను కొద్దిగా తగ్గించడం వంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఇది పెరిగింది. ఆ మార్పులు చక్కని ఫలితాలు ఇవ్వడాన్ని వారు చివరకు చూడగలిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -