నవతెలంగాణ-హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో వరంగల్ జిల్లాలో వినూత్నమైన రీతిలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం నమునాను పోలిన వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా మండపం లోపల న్యాయమూర్తుల ధర్మాసనం తరహాలో పీఠం ఏర్పాటు చేసి దాని మీద జడ్జి రూపాన్ని తలపించే మాదిరిగా వినాయక విగ్రహాన్ని వేద గణపతి యువజన సంఘం కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఎలుక ఆకృతిని బంట్రోత్ గా తీర్చిదిద్దారు. ‘న్యాయమూర్తి గణపతి’గా పిలువబడే ఈ విగ్రహాన్ని వరంగల్ నగరంలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సుప్రీంకోర్టు ఇతివృత్తంతో పోలిన గణేష్ విగ్రహాన్ని దర్శించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఈ సుప్రీంకోర్టు తరహాలో మండపం ఏర్పాటు చేయడం వింతగా ఉందని సందర్శకులు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
“మేము ఈ థీమ్‌ను మూడు నెలల ముందే ప్లాన్ చేశాము. విగ్రహాన్ని రూపొందించడానికి ఒక నెల సమయం పట్టగా, సెట్ నిర్మాణం, కాన్సెప్ట్ రూపకల్పనకు సుమారు 15 నుండి 20 రోజులు పట్టింది. న్యాయవాది అయిన స్నేహితుడి తండ్రి..ఈ థీమ్ రూపకల్పనలో మాకు మార్గనిర్దేశం చేశారని” అని వేద గణపతి యువజన సంఘం కమిటీ సభ్యులు మీడియాకు చెప్పారు.








