మహారాష్ట్రలో ఐద్వా ఆందోళన
ముంబయి : ‘లాడ్లీ బెహనా’ పథకంను పునరుద్ధరించాలని కోరుతూ మహారాష్ట్ర లో భారీ సంఖ్యలో మహిళలతో ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళనను నిర్వహించారు. థానే-పాలగడ్ జిల్లాలోని దహనులో ఈ ఆందోళన జరిగింది. దహను తాలూకాకు చెందిన 3 వేలకు పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే ఆ ఏడాది ఆగస్టులో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ‘లాడ్లీ బెహనా’ పథకాన్ని ప్రారంభించింది. ప్రారంభంలో 2.63 కోట్ల మంది మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. అయితే ఎన్నికల తరువాత మళ్లీ అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ పథకాన్ని వెంటనే నీరు గార్చింది. డిసెంబరు నెల నుంచి సహయాన్ని నిలిపివేసింది. పైగా ‘పరిశీలన ప్రక్రియ’ పేరుతో దాదాపు కోటి మంది మహిళలను ఈ పథకం నుంచి తొలగించారు. దీంతో వీరి కోసం ఐద్వా మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ నెల 20 దహనులో జరిగిన భారీ సభతో ఈ ఉద్యమం మొదలైంది. సెప్టెంబర్ 27 వరకు థానే-పాలఘర్ జిల్లా అంతటా ఇలాంటి సభలు నిర్వహించనున్నారు, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. దహనులో జరిగిన కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షురాలు మరియం ధావలే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి- జాతీయ సంయుక్త కార్యదర్శి ప్రాచి హతివ్లేకర్ తదితర నాయకులు ప్రసంగించారు. మహారాష్ట్రవ్యాప్తంగా పథకం నుంచి తొలగించిన వేలాది మంది మహిళలను ఏకం చేసి, రాజధాని ముంబయిలోని ‘మంత్రాలయ’ (రాష్ట్ర సచివాలయం) వరకు భారీ నిరసన ర్యాలీని నిర్వహించనున్నట్లు ఐద్వా నాయుకులు ప్రకటించారు. ఈ ప్రకటనతో దహను ఆందోళనలలో పాల్గొన్న మహిళల నుంచి భారీ స్పందన లభించింది.
లాడ్లీ బెహనాను పునరుద్ధరించాలి
- Advertisement -
- Advertisement -



