Tuesday, September 22, 2026
E-PAPER
Homeజాతీయంకీలక రంగాల మందగమనం

కీలక రంగాల మందగమనం

- Advertisement -

ఆగస్టులో 4.8 శాతానికి పతనం బొగ్గు, చమురు, ఎరువుల ఉత్పత్తి పేలవం
‌కొనుగోలు శక్తికి ధరల దెబ్బ డిమాండ్‌కు గండి


మోడీ ప్రభుత్వ విధానాలతో ధరల భారం పెరిగి కుదేలైన ప్రజల కొనుగోలు శక్తి అంతిమంగా పారిశ్రామిక రంగంలోని పలు కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే తొమ్మిది కీలక మౌలిక రంగాల వృద్ధి ఆగస్టులో మూడు నెలల కనిష్ఠ స్థాయి 4.8 శాతానికి జారింది. ముఖ్యంగా బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, ఎరువుల ఉత్పత్తి క్షీణించగా.. ఇనుప ఖనిజం వృద్ధి అమాంతం పడిపోవడం పారిశ్రామిక రంగంపై పెరుగుతున్న ఒత్తిడిని స్పష్టం చేస్తోంది.

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ప్రధాన మౌలిక వసతుల రంగం వృద్ధి రేటు మరింత మందగించింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్, ఇనుప ఖనిజం తదితర ఈ తొమ్మిది రంగాల స్థూల ఉత్పత్తి 2026 ఆగస్టులో 4.8 శాతానికి దిగజారింది. అంతకుముందు జులైలో 5 శాతంగా, జూన్‌‌లో 8.2 శాతంగా వృద్ధి చోటు చేసుకుంది. ‌కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ అధీనంలోని ఆఫీస్‌ ఆఫ్‌ ‌ది ఎకనామిక్‌ అడ్వైజర్‌ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కీలక రంగాల ఉత్పత్తి మూడు నెలల కనిష్టానికి పడిపోయింది. ఆధారిత సంవత్సరాన్ని 2022-23కి సవరిస్తూ జూన్‌లో ప్రవేశపెట్టిన నూతన పద్ధతి కింద ఇనుప ఖనిజాన్ని కూడా కలుపుకుని తొమ్మిది రంగాలతో కూడిన సిరీస్ వెలువడిన మూడవ నివేదిక ఇది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ రంగాల వాటా 40.27 శాతంగా ఉంది. గతేడాది ఇదే ఆగస్టులో 6.2 శాతం వృద్ధితోనూ పోల్చినా భారీ తగ్గుదల చోటు చేసుకుంది.
గడిచిన ఆగస్టు నెలలో కీలక రంగాల్లో ఐదు రంగాలు సానుకూల వృద్ధిని కనబరచగా.. మిగితా నాలుగు ప్రతికూలతను చవి చూశాయి. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, ఎరువుల ఉత్పత్తి క్షీణించడం మొత్తం వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపింది. కాగా.. 2026 ఏప్రిల్–ఆగస్టు మధ్య కీలక రంగాల సూచీ 4.3 శాతంగా నమోదయ్యింది. గతేడాది ఇదే కాలంలో 2.4 శాతంగా ఉంది.

విద్యుత్ ఒక్కటే అండ
మందగమనంలో విద్యుత్ రంగం మాత్రం కొంత ఊరటనిచ్చింది. కీలక రంగాల సూచీలో 30.9 శాతం వాటా కలిగిన విద్యుత్ వృద్ధి జులైలో 8.4 శాతంగా ఉండగా.. ఆగస్టులో 11.6 శాతానికి పెరిగింది. ఇది 27 నెలల గరిష్ఠ స్థాయి. అయితే విద్యుత్ రంగం బలమైన పనితీరు ఉన్నప్పటికీ, ఇనుప ఖనిజం, బొగ్గు సహా ఇతర రంగాల్లో కనిపించిన బలహీనత మొత్తం కీలక రంగాల వృద్ధిని దిగజార్చింది.

ఇనుప ఖనిజం అమాంతం పతనం
కీలక రంగాల్లో 4.9 శాతం వాటా కలిగిన ఇనుప ఖనిజం రంగం గడిచిన ఆగస్టు నెలలో అమాంతం పడిపోయింది. జులైలో ఏకంగా 29.5 శాతం వృద్ధి సాధించిన ఈ రంగం ఆగస్టులో ఏకంగా 5.5 శాతానికి పరిమితమైంది. ఇది 11 నెలల కనిష్ఠ స్థాయి కావడం ఆందోళకరం. మరోవైపు 5.6 శాతం వాటా కలిగిన ఉన్న బొగ్గు రంగం జులైలో 7.6 శాతం వృద్ధిని కనబరచగా.. ఆగస్టులో 3.8 శాతానికి క్షీణించింది. ముడి చమురు 3.6 శాతం, సహజ వాయువు 4.9 శాతం మేర క్షీణించాయి. ఎరువుల ఉత్పత్తి ఏకంగా 12.4 శాతానికి పడిపోయింది. దేశంలో అమాంతం పెరిగిన ధరలను కట్టడి చేయడంలో మోడీ సర్కార్‌ ‌విఫలం కావడంతో ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోవడం కీలక రంగాల ఉత్పత్తి మందగమనానికి ప్రధాన కారణం. డిమాండ్‌ ‌తగ్గడంతో కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాల్సి వస్తుంది. ఇది పారిశ్రామిక వ్యవస్థను ఒత్తిడికి గురి చేయడంతో పాటుగా ఆర్థిక వ్యవస్థ చట్రాన్ని అంతిమంగా దెబ్బతీస్తుందని.. పెట్టుబడులు మందగించడంతో పాటు ఉపాధిపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -