Tuesday, September 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణ మలిదశఉద్యమంలో కీలక పాత్ర

తెలంగాణ మలిదశఉద్యమంలో కీలక పాత్ర

- Advertisement -

లింగాల కేదారి, పుష్పలత సేవలు మరువలేనివి
వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం : అధికారులకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన లింగాల కేదారి, ఆయన భార్య పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో లింగాల కేదారి, పుష్పలత అంకితభావంతో అందించిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. కేదారి దంపతులు ఒక సాధారణ హోటల్ నడుపుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, వృథా చేయకూడదని అవగాహన కల్పిస్తూ, సమాజం పట్ల ఎంతో బాధ్యతగా నడుచుకున్నారు. ఉద్యమ సమయంలో వీరు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీలు అందించారు. హనుమకొండలోని శాంతినగర్, పోస్టల్ కాలనీకి చెందిన లింగాల కేదారి 2026 సెప్టెంబర్ 9న, ఆయన భార్య పుష్పలత 2026 సెప్టెంబర్ 10న విషాదకర సంఘటనలో మరణించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి సీఎంఆర్ఎఫ్ నుంచి సీఎం ఓఎస్డీ రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. మంజూరైన ఆర్థిక సాయాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులు, కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

​మండల రాజు కుటుంబానికి రూ.5 లక్షల సాయం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో అదృశ్యమైన మండల రాజు కుటుంబానికి మానవతా దృక్పథంతో రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన మండల సమ్మిరెడ్డి కుమారుడు మండల రాజు (34) 2013 జూన్ 20న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో అదృశ్యమయ్యారు.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విజ్ఞప్తి మేరకు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ ఉద్యమంలో మండల రాజు చురుకుగా పాల్గొన్నారని, ఈ క్రమంలో ఆయన అరెస్టై చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్బంధించబడ్డారని, ఆ తర్వాత కాలంలో అదృశ్యమయ్యారని ఎమ్మెల్యే తన లేఖలో పేర్కొన్నారు. మండల రాజు తన వృద్ధ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడని, ప్రస్తుతం వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, రోజువారీ జీవనోపాధికి ఎలాంటి ఆధారం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణ అమరవీరుల కోటా కింద మానవతా దృక్పథంతో ఆయన తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామానికి చెందిన మండల సమ్మి రెడ్డికి రూ. 5 లక్షలు ఆర్థిక సాయం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -