Tuesday, September 22, 2026
E-PAPER
Homeజాతీయం‘దానం’ పిటిషన్ విచార‌ణకు అనుమతి

‘దానం’ పిటిషన్ విచార‌ణకు అనుమతి

- Advertisement -

రేపు సుప్రీంకోర్డులో విచారణ
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో

దానం నాగేందర్ పిటిషన్‌ విచారణకు అత్యు న్న‌త న్యాయ‌స్థానం అనుమతించింది. తెలంగాణ హైకోర్టు అనర్హత ఆదేశాల నేపథ్యంలో ఉప ఎన్నిక నోటిఫికేషన్‌పై ఆందోళనగా ఉందని దానం నాగేం దర్ తరపు సీనియర్ న్యాయ‌వాది ముకుల్ రోహిత్గి సుప్రీంకోర్టుకు నివేదిం చారు. అందువల్ల ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. పార్టీ ఫిరాయించారన్న కారణంతో తనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును ఈనెల 19న‌ దానం నాగేందర్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ అనర్హత పిటిషన్‌పై విచారణ జరపాలని దానం నాగేందర్ తరపు ముకుల్ రోహిత్గి సోమవారం సీజేఐ జ‌స్టిస్ సూర్యకాంత్‌ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. స్పీకర్ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించగా, తెలంగాణ హైకోర్టు విచారించి అనర్హతా వేటు వేసిందని వివరించారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అందువల్ల అత్యవసరంగా విచారించాలని కోరారు. ‘రేపటి విచారణ జాబితాలో అత్యవసరంగా విచారించాలని కోరుతున్నాను. గత శుక్రవారం తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్ ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఇదే విషయంలో దానం నాగేందర్ పై పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌ను స్పీకర్ తిర‌స్క‌రించారు. దానం నాగేందర్ తన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. కానీ.. పార్టీతో సంబంధం లేని వ్యక్తి (బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్) ఈ పిటిషన్ ను వేశారు’ అని ధ‌ర్మాసనానికి నివేదించారు. ఇది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లోని అనర్హతకు సంబంధించినదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం, స్పీకర్ ఖైరతాబాద్ ఖాళీ అని నోటిఫై చేస్తే ఉప ఎన్నిక‌కు నోటిఫికేషన్ విడుద‌ల‌ చేసే ఆస్కారం ఉందన్నారు. అందువల్ల పిటిషన్‌ను నేడు (మంగళవారం) విచారణ చేపట్టాలని కోరారు. ప్రతివాదుల తరపు న్యాయవాదులు కూడా కోర్టు హాల్‌లోనే ఉన్నారని నివేదించారు. దీనిపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపు సీనియ‌ర్ న్యాయ‌వాది మహేశ్ జఠ్మలాని స్పందిస్తూ, రేపు (బుధవారం) ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. అన్ని వైపుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, బుధవారం ఈ పిటిషన్‌ను విచారిస్తామ‌ని తెలిపింది. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న తాను 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసినందుకు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని పేరా 2(1)(ఎ) రెడ్‌ విత్‌ ఆర్టికల్‌ 191(2)కింద తనను హైకోర్టు అనర్హుడిగా ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎమ్మెల్యే అనర్హత విషయంలో స్పీకర్‌ తీసుకొనే నిర్ణయా లను న్యాయస్థానాలు సమీక్షించడానికి వీలులేద‌ని పిటిషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -