Tuesday, September 22, 2026
E-PAPER
Homeజాతీయంబీమా రంగంలోనూ యూపీఐ

బీమా రంగంలోనూ యూపీఐ

- Advertisement -

పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీకి ఐఆర్‌డీఏఐ కసరత్తు
న్యూఢిల్లీ : భారత బీమా రంగంలో సమూల మార్పులు తెచ్చేందుకు ఇన్సూరెన్స్‌ ‌రెగ్యూలేటరీ అండ్‌ ‌డెవలప్‌‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డిజిటల్ పేమెంట్స్ రంగంలో యుపిఐ సంచలనం సృష్టించినట్లే.. బీమా రంగంలోనూ పారదర్శకతను పెంచేందుకు ప్రతిపాదిత పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ (పీఐఆర్‌) తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఐఆర్‌డీఏఐ ఇటీవల ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. పాలసీదారులకు అన్ని బీమా వివరాలు ఒకే చోట లభించడం, సులభంగా కేవైసీ పూర్తి చేయడం, క్లెయిమ్ చరిత్ర అందుబాటులోకి రావడం వంటి ప్రయోజనాలు ఈ వ్యవస్థ ద్వారా చేకూరుతాయి. జీ-20 డీపీఐ మార్గదర్శకాల ఆధారంగా రూపొందిస్తున్న ఈ ఫెడరేటెడ్ ఆర్కిటెక్చర్ విధానం వల్ల డేటా భద్రతకు ఎటువంటి భంగం కలగకుండా పాలసీదారులకు, బీమా సంస్థలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా సమాచారమంతా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా డేటా ఎక్కడ సేకరించబడిందో అక్కడే సురక్షితంగా ఉండేలా ఫెడరేటెడ్ ఆర్కిటెక్చర్‌ను అవలంబిస్తున్నారు. దీని ద్వారా పాలసీదారులకు జీవిత, ఆరోగ్య, మోటార్ , ఆస్తి బీమాలకు సంబంధించిన అన్ని పాలసీల వివరాలు ఒకే చోట కనిపిస్తాయి. నామినీలు, రెన్యూవల్స్, క్లెయిమ్‌లు సులభంగా పర్యవేక్షించవచ్చు. పాలసీల మార్పిడి (పోర్టబిలిటీ) మరింత సులభమవుతుంది. బీమా కంపెనీలకు పాలసీలు, క్లెయిమ్ చరిత్ర పారదర్శకంగా లభించడం వల్ల అండర్‌రైటింగ్ ఖచ్చితత్వం పెరుగుతుంది. మోసాలను అరికట్టడానికి వీలవుతుందని ఐఆర్‌‌డిఎఐ వర్గాలు భావిస్తున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వాలకు కూడా వెరిఫైడ్ కవరేజ్ డేటా అందుబాటులోకి రావడం వల్ల రుణాల మంజూరు, సంక్షేమ పథకాల అమలు మరింత సులభమవుతుంది.
ప్రస్తుతం బీమా రంగంలో పాలసీదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకే వ్యక్తి వివిధ బీమా సంస్థల నుంచి పాలసీలు తీసుకున్నప్పటికీ ప్రతిసారీ కేవైసీ ప్రక్రియను విడివిడిగా పూర్తి చేయాల్సి వస్తోంది. అలాగే, క్లెయిమ్ చరిత్ర అందుబాటులో లేకపోవడం వల్ల అండర్‌రైటింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతు న్నాయి.అంతేకాకుండా వినియోగదారులు తమకు నచ్చిన బీమా పాలసీని సులభంగా పోల్చుకునే అవకాశం లేక, ఏజెంట్లు చెప్పే మాటల మీదే ఆధారపడాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి బీమా చేయడం అనే పద్ధతి నుంచి వినియోగదారుడే స్వయంగా బీమా కొనుగోలు చేసే స్థాయికి మార్చడమే ఈ రిజిస్ట్రీ ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను పూర్తిగా ఐఆర్‌డీఏఐ యాజమాన్యంలోని లాభాపేక్ష లేని సంస్థగా పునర్వ్యవస్థీకరించాలని ప్రతిపాదించారు. పాలసీదారుల సమాచార భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దశలవారీగా ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నూతన విధానం ద్వారా బీమా రంగంలో పారదర్శకత పెరిగి రాబోయే రోజుల్లో బీమా వ్యాప్తి గణనీయంగా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -