Tuesday, June 9, 2026
E-PAPER
Homeజాతీయం​అఖిలపక్ష‍ం 
ఏర్పాటు చేయండి

​అఖిలపక్ష‍ం 
ఏర్పాటు చేయండి

- Advertisement -

ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై చర్చించాలి
విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి
‘సర్‌’పై సీజేఐకి లేఖ‌ రాయాలి : 
ఢిల్లీలో జరిగిన ఇండియా బ్లాక్ స‌మావేశంలో కీలక నిర్ణయాలు
ఆగ‌స్టులో హైద‌రాబాద్‌లో త‌దుప‌రి స‌మావేశం

నవతెలంగాణ-న్యూఢిల్లీ​
ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అఖిలప‌క్షం ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు డిమాండ్ చేశారు. సోమ‌వారం నాడిక్క‌డ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఇండియా బ్లాక్ స‌మావేశం జ‌రిగింది. దీనికి 25 ప్రతిపక్ష పార్టీల నుండి 39 మంది నాయకులు హాజర య్యారు. ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జరిగిన కీలక సమావేశంలో ‘‘ఇండియా బ్లాక్‌’’ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నీట్, సీబీఎస్ఈ పరీక్షలకు హాజ‌రైన లక్ష‌లాది మంది యువ‌త‌కు ద్రోహం చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు డిమాండ్ చేశారు. ఆయ‌న రాజీనామా కోరుతూ చేస్తున్న నిరసనలను మరింత ఉధృతం చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నికల్లో అవకతవకలు, ఓట్ల దోపిడి, పారదర్శకత లోపించాయని ఎత్తి చూపుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి ఎస్ఐఆర్‌పై లేఖ రాయాల‌ని నిర్ణ‌యించారు. ఆర్థిక సంక్షోభం, నిరుద్యో గం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, మ‌హిళ‌లు, అణ‌గారిన వ‌ర్గాల‌పై జ‌రుగు తున్న అఘాయిత్యాలు వంటి అంశాలపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు మరింత ఐక్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను బహిర్గతం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకు న్నారు. ఇండియా బ్లాక్ స‌మావేశం ఇక నుంచి రెండు నెలల‌కొక‌సారి జ‌ర‌పాల‌ని, తదుపరి సమావేశం ఆగస్టులో హైదరా బాద్‌లో జరపాల‌ని నిర్ణ‌యించారు. ఈ స‌మావేశంలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, తృణ మూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, జ‌మ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి, నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ నేత‌ ఒమర్ అబ్దుల్లా, ఆర్‌జెడి నేత తేజస్వీ యాద‌వ్‌, సీపీఎం రాజ్యసభ ప‌క్ష నేత జాన్‌ బ్రిటాస్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ ఎంఎల్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, శివసేన (ఠాక్రే) పక్షనేత సంజయ్ రావత్, ఎన్‌సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే, కేరళ కాంగ్రెస్ (ఎం) నేత‌ జోస్ కె మణి, కేరళ కాంగ్రెస్ జోసెఫ్ ఫ్యాక్షన్ నాయకుడు ఫ్రాన్సిస్ జార్జ్, ముస్లిం లీగ్ నాయకులు సాదిక్ షిహాబ్ తంగల్, ఆర్‌ఎస్‌‌పీ నేత ఎన్‌కే ప్రేమ్ చంద్ర‌న్‌, ఎంపీ కపిల్ సిబల్, వీసీకే నేత తిరుమావళవన్, ఎండీఎంకే నేత‌ వైగో, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. జార్ఖండ్ ముఖ్య‌మంత్రి, జెఎంఎం అధ్య‌క్షుడు హేమంత్ సోరెన్‌, శివ‌సేన నేత‌లు ఉద్ద‌వ్ ఠాక్రేలు వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నారు.

​స‌వాళ్ల‌పై ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త‌
​స‌మావేశం అనంత‌రం మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే మాట్లాడుతూ ఎస్ఐఆర్‌, ఓట్‌ ‌చోరీపై సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి త్వ‌ర‌లోనే లేఖ అంద‌జేస్తామన్నారు. మోడీ ప్ర‌భుత్వం దుష్ప‌రిపాల‌న కార‌ణంగా దేశం ఎదుర్కొంటున్న రాజ‌కీయ‌, ఆర్థిక‌, సామాజిక‌, విదేశాంగ విధాన స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌తిప‌క్ష నేత‌లంతా ఐక్యంగా ఉన్నార‌ని అన్నారు. లోక్‌స‌భ‌లో ఎలాగైతే డీలిమిటేష‌న్ బిల్లును ఎదుర్కొన్నామో అదే స్ఫూర్తితో మ‌రింత బ‌లోపేతం చేసుకుని ముందుకు సాగాల‌ని సూచించారు. రాజ్యాంగంపై దాడి కొన‌సాగుతోంద‌ని, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను వేధించ‌డానికి, భ‌య‌పెట్ట‌డానికి, బెదిరిం చ‌డానికి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను నిరంత‌రం సాధ‌నాలుగా వాడుకుంటున్నార‌ని విమ‌ర్శిం చారు. దేశ ఆర్థిక ప‌రిస్థితి అత్యంత ప్ర‌తికూ లంగా ఉంద‌ని, కొత్త ఉద్యోగాలను సృష్టించ‌ డానికి అవ‌స‌ర‌మైన వేగంతో కొత్త పెట్టుబ‌డులు రావ‌డం లేద‌న్నారు. దేశంలో ప‌రీక్షా విధానంలో పూర్తిస్థాయి దుర్వినియోగం కార‌ణంగా ల‌క్ష‌లాది యువ‌త ఆశ‌లు, ఆకాంక్ష‌లు దెబ్బ‌తింటున్నాయ‌ని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల ఓటు హ‌క్కును హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌పై వివ‌క్ష చూపుతున్నార‌ని, అనేక రంగాల్లో ప్రయివేటు గుత్తాధిప‌త్యాలు పెరుగుతున్నాయ‌నీ, ఎంఎస్ఎంఈల భ‌విష్య‌త్తు తీవ్ర సంక్షోభంలో ఉంద‌ని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బ‌ల‌హీన వ‌ర్గాల‌పై అఘాయిత్యాలు నిర్విరా మంగా కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. మ‌న విదేశాంగ విధానం పూర్తిగా దెబ్బ‌తింద‌ని, భారతదేశం ఎప్పటినుంచో దృఢంగా స‌మ‌ర్థి స్తున్న సాంప్ర‌దాయ విలువ‌ల‌ను మోడీ సర్కార్‌ నిల‌బెట్ట‌లేకపోతున్నదని విమ‌ర్శించారు.

​కాంగ్రెస్ వైఖ‌రిపై నిల‌దీత‌
​బీజేపీకి వ్య‌తిరేకంగా నిల‌బ‌డిన‌ ప్రతిపక్ష కూటమిని కాంగ్రెస్‌ బలహీనపరుస్తుంద‌ని ప‌లు పార్టీలు విమ‌ర్శించాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్‌ సమావేశంలో తీవ్ర నిరసన వెల్లువెత్తింది. కాంగ్రెస్ సంకుచిత రాజకీయ ప్రయోజనాలపై వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ వంటి పార్టీలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం కేంద్ర సంస్థలను ఆయుధాలుగా ఉపయో గించినప్పుడు ఇండియా బ్లాక్‌ ఐక్యంగా నిలబడాలని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ సమస్యపై ఇండియా బ్లాక్‌ ఒకే వైఖరిని అవలంబించాలని ఆయా పార్టీల నేత‌లు డిమాండ్ చేశారు. ​కేరళ ఎన్నికల సమయంలో వామపక్షాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయ నాయకులు చేసిన నిరాధార ప్రచారాన్ని సీపీఎం రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్ ఎత్తి చూపారు. వామపక్షాలకు, బీజేపీకి మధ్య రహస్య అవగాహన ఉందని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి నాయకులు పచ్చి అబద్ధం ప్రచారం చేశారని ఆయన అన్నారు.‘‘బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి వామపక్షాలు కఠిన వైఖరి వల్లే మొదటి యుపీఏ ప్రభుత్వం ఏర్పడిందనీ, రాహుల్ గాంధీ ఆ చరిత్రను సౌకర్యవంతంగా కప్పిపుచ్చి, వామపక్షాలకు, బీజేపీకి మధ్య ఒక ఒప్పందం జరిగిందని ఆరోపణలు చేశారని చెప్పారు.

బీజేపీ వ్యతిరేక వైఖరిపై వామపక్షాలకు కాంగ్రెస్ సర్టిఫికేట్ అవసరం లేదని జాన్ బ్రిట్టాస్ సమావేశంలో స్పష్టంగా చెప్పారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా కూడా రాహుల్‌‌గాంధీ రాజకీయ అపరిపక్వతను ప్రశ్నించారు. దీనికి కలత చెందిన రాహుల్ గాంధీ, తాను ఆ వ్యాఖ్యల్ని వాస్తవాల ఆధారంగానే చేశానని బదులిచ్చారు. మీ వద్ద ఉన్న వాస్తవాలు ఏమిటని వామపక్ష నాయకులు ప్రశ్నించారు. అదానీని కేరళకు తీసుకువచ్చింది ఎల్‌డీఎఫ్ అనీ, ఇది ఒప్పందంలో భాగమని రాహుల్ చెప్పారు. దీనికి వామపక్ష‍ నేతలు స్పందిస్తూ ‘మీ అవగాహన తప్పు. అదానీని కేరళకు తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే’ అని గుర్తు చేశారు. అనంతరం ఆర్జేడీ అధినేత అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ కూడా కాంగ్రెస్‌ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రశ్నలు సంధించారు. బీజేపీ నుంచి డీఎంకే, ఆప్ దూరంగా ఉండటం పెద్ద ఎదురుదెబ్బ అని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇదే పద్ధతిలో కొనసాగాలా వద్దా అనే దానిపై తీవ్రంగా పరిశీలించాలని అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌డిమాండ్‌ చేశారు. బీహార్‌లో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య అనేక విషయాలపై రహస్య అవగాహనలు ఉన్నాయని తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ విషయాన్ని తాను కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో చాలాసార్లు ప్రస్తావించాననీ, అయినా దాన్ని సరిదిద్దడానికి వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

​రాహుల్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు
​ఇండియా బ్లాక్ సమావేశానికి ముందు ఢిల్లీలోని అనేక చోట్ల కాంగ్రెస్, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. ఇండియా బ్లాక్‌లోని వివిధ పార్టీల నాయకులు రాహుల్‌పై పలు సందర్భాల్లో చేసిన తీవ్ర విమర్శలు, వ్యాఖ్యలతో కూడిన బ్యానర్లు ఢిల్లీలోని ప్రధాన రహదారులపై కనిపించాయి. ఈ పోస్టర్లు, బ్యానర్లు మీడియా దృష్టిని ఆకర్షించడంతో, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వాటన్నింటినీ తొలగించారు. ఈ బ్యానర్ల వెనుక బీజేపీ ఉందని వారు ఆరోపించారు. బ్యానర్లపై ‘ఇండీ అలయన్స్’ అని రాసి ఉండటమే దీనికి నిదర్శనమని వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -