Tuesday, August 11, 2026
E-PAPER
Homeజాతీయంచారిత్రాత్మకం : సీఐటీయూ

చారిత్రాత్మకం : సీఐటీయూ

- Advertisement -

​న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసిస్తూ జాతీయస్థాయిలో జరిగిన జైల్‌‌భరో ఆందోళన చారిత్రాత్మకమైన రీతిలో విజయవంతమైందని సీఐటీయూ అభినందించింది. కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, స్కీమ్‌ ‌వర్కర్లు, విద్యార్ధులు, యువత, మహిళలు, అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలు పాల్గొన్నారని, దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కేంద్రాల్లో, ప్రాంతాల్లో 10లక్షల మందికి పైగా అరెస్టయ్యారని పేర్కొంటూ వారికి విప్లవాభినందనలు తెలియచేసింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ ‌మోర్చా (ఎస్కేఎం) సంయుక్తంగా ఈ ఆందోళనకు పిలుపిచ్చాయి.
పని ప్రదేశాల్లో ధర్నాలు, వీధుల్లో ఆందోళనలు, ప్రదర్శనలు నుంచి రైల్‌‌రోకో, రాస్తారోకో, మూకుమ్మడి అరెస్టుల వరకు పలు రీతుల్లో సాగిన ఆందోళనలు, నిరసనలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు, కార్పొరేట్‌ అనుకూల విధానాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర ఆవేదనను, అసహనాన్ని ప్రతిబింబించాయని సీఐటీయూ ప్రకటన పేర్కొంది. ఇంత పెద్ద స్థాయిలో స్వచ్ఛంద అరెస్టులకు పోలీసు యంత్రాంగం కూడా సన్నద్ధంగా లేదని ఆ ప్రకటన వివరించింది. ఈనాటి విజయవంతమైన ఈ కార్యాచరణ కీలకమైన మైలురాయి అని సీఐటీయూ స్పష్టం చేసింది. పోరాటంలో కొత్త దశ ఆరంభమైందని పేర్కొంది. ఈ జాతి వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల ప్రభుత్వం నుంచి ప్రజలను, దేశాన్ని కాపాడేందుకు భవిష్యత్‌‌లో తమ తమ వేదికల నుంచి కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ ‌మోర్చా అత్యంత సమన్వయంతో సంయుక్త పోరాటాలు చేపడతాయని ఆ ప్రకటన వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -