Sunday, September 20, 2026
E-PAPER
Homeజాతీయంవికసిత్ భారత్ లో తెలంగాణది కీలక పాత్ర

వికసిత్ భారత్ లో తెలంగాణది కీలక పాత్ర

- Advertisement -

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం
దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను 
5 నుంచి 10 శాతానికి పెంచే దిశగా ప్రణాళిక
ప్రభుత్వ రుణాలపై ఆధారపడే విధానం నుంచి ప్రయివేటు, సంస్థాగత పెట్టుబడుల
సమీకరణ వైపు అడుగులు
క్యూర్‌-ప్యూర్‌-రేర్‌ విధానంతో రాష్ట్రవ్యాప్తంగా సమతుల్య అభివృద్ధి
30 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీ
యువతే తెలంగాణకు అతిపెద్ద బలం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

న్యూఢిల్లీ: వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దేశం నిర్దేశించుకున్న భారీ ఆర్థిక లక్ష్యాలను సుదూర ఆశయాలుగా కాకుండా, తక్షణ కార్యాచరణ బాధ్యతగా తెలంగాణ భావిస్తోందని వివరించారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో న్యూఢిల్లీలో జరిగిన ‘వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి ఆర్థిక వనరుల సమీకరణ’ సదస్సులో శనివారం డిప్యూటీ సీఎం ప్రసంగించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.వికసిత్ భారత్ నిర్మాణాన్ని కేంద్రం లేదా రాష్ట్రాలు విడివిడిగా సాధించలేవని, సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం–రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు వనరులను సమర్థంగా సమీకరించడంతో పాటు బలమైన సంస్థలు, పరస్పర సహకార విధానాలు అవసరమన్ని తెలిపారు. తెలంగాణ కేవలం నిధులను కోరేందుకు కాకుండా, స్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక, ఆర్థిక వనరుల సమీకరణకు నిర్దిష్ట విధానం, దీర్ఘకాలిక లక్ష్యంతో ఈ చర్చలో భాగస్వామ్యమవుతోందని తెలిపారు.

ప్రయివేటు పెట్టుబడుల సమీకరణకు ప్రాధాన్యం
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలంటే మౌలిక వసతులకు నిధులు సమకూర్చే విధానంలో మార్పు అవసరమని భట్టి విక్రమార్క వివరించారు. రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వ రుణాలపైనే అధికంగా ఆధారపడే పద్ధతి నుంచి క్రమంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయివేటు పెట్టుబడులు, సంస్థాగత నిధులు, సావరిన్ ఫండ్స్ నుంచి అధిక మొత్తంలో పెట్టుబడులను సమీకరించి, ప్రభుత్వ నిధులను వ్యూహాత్మకంగా వినియోగించే నమూనా వైపు తెలంగాణ అడుగులు వేస్తోందన్నారు. ప్రాజెక్టుల్లో పెట్టుబడిదారుల రిస్క్‌ను తగ్గించడం, వయబిలిటీ గ్యాప్‌లను పూడ్చడం, ప్రయివేట్ పెట్టుబడులకు విశ్వాసం కల్పించడం వంటి అంశాల్లో ప్రభుత్వ నిధులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇందుకోసం పబ్లిక్–ప్రయివేట్ భాగస్వామ్యాలు (పీపీపీ), గ్రీన్ బాండ్లు, బ్లెండెడ్ ఫైనాన్స్ వంటి మార్గాలను బలోపేతం చేస్తున్నట్టు చెప్పారు.

క్యూర్‌-ప్యూర్‌-రేర్‌తో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి
అభివృద్ధి ఒకే నగరానికి పరిమితం కాకూడదని, అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలు వెనుకబడకూడదన్న లక్ష్యంతో తెలంగాణ క్యూర్‌-ప్యూర్‌-రేర్‌ పేరుతో మూడు పరస్పర అనుసంధానిత ఆర్థిక ప్రాంతాలతో ప్రత్యేక అభివృద్ధి నమూనాను రూపొందించిందని డిప్యూటీ సీఎం తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా క్యూర్‌ (కోర్‌ అర్బన్‌ రీజియన్‌)ను అత్యున్నత సేవలు, కృత్రిమ మేధ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఫిన్‌టెక్, లైఫ్ సైన్సెస్, నాలెడ్జ్ ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ప్రధాన రవాణా మార్గాల వెంట ప్యూర్ (పెరీ-అర్బన్‌ రీజియన్‌)ను పారిశ్రామిక, తయారీ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. రేర్‌ (రూరల్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రీసోర్సెస్‌ ఎకానమి) ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తీసుకురానున్నట్టు చెప్పారు.

30 వేల ఎకరాలకు పైగా భారత్ ఫ్యూచర్ సిటీ
దేశంలో భవిష్యత్ నగరాలకు నమూనాగా 30 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో తొలి నెట్-జీరో, ఏఐ ఆధారిత గ్రీన్ మెగాసిటీగా దీన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాలు, క్లీన్ టెక్నాలజీ పార్కులు, పర్యావరణహిత నివాస ప్రాంతాలు ఇందులో భాగంగా ఉంటాయని వివరించారు.

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
తెలంగాణ బలమైన ఆర్థిక పునాదులతో తదుపరి దశ వృద్ధికి సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. 2025-26లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని, ప్రస్తుత ధరల ప్రకారం 10.7 శాతం వృద్ధి నమోదైందన్నారు. స్థిర ధరల ప్రకారం వాస్తవ జీఎస్‌డీపీ వృద్ధి 8.5 శాతంగా అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, ఇది జాతీయ సగటు రూ.2,19,575తో పోలిస్తే దాదాపు రెండింతలని వివరించారు. సేవల రంగం 13.5 శాతం, ద్వితీయ రంగం 9.4 శాతం వృద్ధి సాధించాయని తెలిపారు. ప్రస్తుత వృద్ధి పథంలో కొనసాగితే 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1.21 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా ఉందని, అయితే 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పించామని ప్రకటించారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను ప్రస్తుతం ఉన్న దాదాపు 5 శాతం నుంచి 10 శాతానికి పెంచాలన్నది లక్ష్యమని తెలిపారు.

యువతే తెలంగాణకు అతిపెద్ద బలం
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు మౌలిక వసతులు, పెట్టుబడులతో పాటు మానవ వనరులే అసలైన పునాది అని డిప్యూటీ సీఎం అన్నారు. తెలంగాణ యువతే రాష్ట్రానికి అతిపెద్ద బలమని వివరించారు. ఉన్నత విద్యకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆర్థిక వృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికీ చేరాలని, సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యం రాష్ట్రానికే పరిమితమైనది కాదని, 2047 నాటికి సుసంపన్నమైన, స్వావలంబనతో కూడిన వికసిత్ భారత్ నిర్మాణానికి తెలంగాణ అందించే భాగస్వామ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -