నియంత్రణ చర్యల్లో మోడీ సర్కార్ ఫెయిల్
వర్షాభావంతో పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం ..సామాన్యుడి వంటింటిపై ‘ధరా’భారం
కేంద్రంవైపు ఆశగా చూస్తున్న రాష్ర్టాలు ..ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించని కేంద్రం
దేశంలో ఇప్పటికే పెరుగుతున్న ఆహార ధరలకు ఎల్‌నినో తోడైంది. ఫలితంగా దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఆహార భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. రుతుపవన లోటు, అంతర్జాతీయ ముడిచమురు ధరల పెరుగుదల, దిగుమతులపై ఆధారపడటం వంటి అంశాలపై కేంద్రంలోని మోడీ సర్కార్ ముందుచూపు లేని విధాన నిర్ణయాల వల్ల ఇప్పుడు సామాన్యుడిపై ‘ధరాభారం’ పడుతోంది. యూపీఐ పేమెంట్స్‌పై చార్జీల విధింపు కూడా దానిలో భాగమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలతో సామాన్య కుటుంబాల జీవన వ్యయం పెరుగుతోంది. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ర్ట ప్రభుత్వాలు ఎల్‌నినో కష్టంనుంచి తమను గట్టెక్కించాలని కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం నేరుగా అసెంబ్లీలోనే దీనిపై తీర్మానం చేసి, కష్టకాలంలో తమకు రూ.20వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కోరింది
న్యూఢిల్లీ : దేశంలో ఆహార ధరల పెరుగుదలకు కేవలం వర్షాభావమే కారణం కాదు. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు దీనికి ప్రధాన కారణం. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. తాజాగా దానికి ఎల్‌నినో రూపంలో రుతుపవన లోటు కూడా తోడయ్యింది. ఈ పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కాలనే ముందస్తు వ్యూహంలో కేంద్రంలోని మోడీ సర్కార్ చతికిలపడింది. గతేడాది సెప్టెంబర్‌లో కిలో ఉల్లిపాయ సగటు ధర రూ.27 ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో అది రూ.54కు చేరింది. చక్కెర ధర రూ.47 నుంచి రూ.59కు పెరిగింది. ఫిబ్రవరిలో 3.47 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం మేలో 4.78 శాతానికి చేరింది. ఆగస్టులో ఇది 5.95 శాతానికి పెరిగింది. అంటే వర్షాకాలం ప్రారంభానికి ముందే ధరల పెరుగుదల గణనీయంగా నమోదైంది. వర్షాభావం ప్రారంభమైన తర్వాత కూడా ఆహార ధరల పెరుగుదల కొనసాగింది.సగం దేశం పొడిబారిన పరిస్థితుల్లోనే..సెప్టెంబర్ 16తో ముగిసిన వారంలో దేశంలోని సుమారు 52 శాతం భూభాగం అసాధారణ పొడిబారిన పరిస్థితులు, కరువు ప్రభావంలో ఉన్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి.
ఇందులో ఐదో వంతు ప్రాంతం తీవ్రమైన కరువు, అంతకంటే అధిక స్థాయి కరువు పరిస్థితుల్లో ఉంది. వర్షపాతం, నీటి ప్రవాహం, నేలలో తేమ వంటి అంశాల ఆధారంగా ఈ అంచనా రూపొందించారు.ధరల పెరుగుదలపై కేంద్రం ఏం చేస్తోంది?ఆహార ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కెర దిగుమతులపై సుంకాన్ని తగ్గించింది. అ యినా ధర నియంత్రణ జరగలేదు. కొన్ని రాష్ట్రాల్లో సబ్సిడీ ఉల్లిపాయలను నామమా త్రంగా విక్రయిస్తున్నారు. కానీ ఆ చర్యలు మార్కెట్ ధరలను తగ్గించలేకపోయాయి. రైతులకు లభించే ధరలు, వినియోగదారులు చెల్లించే ధరల మధ్య వ్యత్యాసం భారీగా పెరిగింది. ధరల నియంత్రణలో తాత్కాలిక చర్యలతో పాటు వ్యవసాయ ఉత్పత్తి, నిల్వ సదుపాయాలు, సరఫరా వ్యవస్థ, మార్కెట్ పర్యవేక్షణపై దీర్ఘకాలిక చర్యలు అవసరం. కానీ మోడీ సర్కార్ వాటి కల్పనలో వైఫల్యాలను ఎదుర్కొంటూనే ఉంది. అదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు సామాన్య ప్రజలకు తగిన ఉపశమనం అందించడం లేవు. ఆహార ధరలు పెరుగుతున్న సమయంలో తక్కువ ఆదాయ కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
రుతుపవన కాలం ముగింపుపై అంచనాలు
భారత రుతుపవన కాలం సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ సీజన్‌లో వర్షపాతం లోటు 13 నుంచి 16 శాతం మధ్య ముగిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో సెప్టెంబర్ చివర్లో తుపాను ఏర్పడే అవకాశం ఉందనీ, దాని ప్రభావంతో తూర్పు, ఈశాన్య భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా మొత్తం వర్షపాతంపై పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంచనాలు పేర్కొంటున్నాయి. అయితే సాధారణ స్థాయి కంటే 10 నుంచి 20 శాతం తక్కువ వర్షపాతంతో సీజన్ ముగిసే అవకాశముందని మెజారిటీ నిపుణులు అంచనా వేశారు.
ధరలపై ముందున్న సవాళ్లు
వర్షపాతం లోటు ఆహార ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు. వర్షపాతం లోటులో ప్రతి ఒక శాతం పెరుగుదలకు ఆహార ద్రవ్యోల్బణం సుమారు 25 బేసిస్ పాయింట్లు పెరగవచ్చనే అంచనా ఉంది. అయితే ప్రస్తుత సీజన్‌లో నమోదైన వర్షపాతం లోటు ఇప్పటికే మార్కెట్ ధరల్లో గణనీయంగా ప్రతిబింబించింది. రుతుపవనాల ముగింపు, పంటల దిగుబడి, దిగుమతుల ధరలు, ప్రభుత్వ చర్యలు రాబోయే నెలల్లో ఆహార ధరల దిశను నిర్ణయించనున్నాయని నిపుణులు చెప్తున్నారు.
సామాన్యుడిపై పెరుగుతున్న భారం
గతేడాది రుతుపవన కాలంలో సాధారణ స్థాయి కంటే 108 శాతం వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకే ఏడాది వ్యవధిలో వర్షపాతం పరిస్థితుల్లో వచ్చిన మార్పులు రైతులు, వినియోగదారులు, ప్రభుత్వానికి సవాలుగా మారాయి. ఇప్పటికే పెరిగిన ఉల్లిపాయ, చక్కెర, వంటనూనె ధరలకు వర్షాభావం మరింత తోడైతే సామాన్య కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. ఆహార ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షపాతం లోటు ఒక్కటే సమస్య కాదు.. ముందుగానే పెరిగిన ధరలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, దేశీయ సరఫరా వ్యవస్థలోని లోపాలు కలిసి సామాన్యుడి వంటింటిపై భారాన్ని పెంచుతున్నాయి.
కేంద్రంవైపు రాష్ర్టాల చూపు
ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో దేశంలోని అనేక రాష్ర్టాలు కేంద్ర ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మోడీ సర్కార్ ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఎల్‌నినో ఎఫెక్ట్ తో నష్టపోతున్న ఆదాయాన్ని కేంద్రం సర్దుబాటు చేయాలని కోరింది. రూ.20వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని స్వయంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కానీ అటునుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని రాష్ర్ట అధికారులు చెప్తున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఆ రాష్ర్టాలు కేంద్రాన్ని అడగాలో వద్దో అనే మీమాంసలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సహాయం కోరితే ప్రధాని మోడీ దృష్టిలో తాము తక్కువవుతామేమో అనే డౌట్ బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల్లో ఉన్నదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా అనేక రాష్ర్టాల్లో నిర్దేశిత ప్రమాణాలకంటే జీఎస్‌డీపీ దారుణంగా పడిపోతున్నదని విశ్లేషిస్తున్నారు.
రికార్డు స్థాయిలో ఎల్‌నినో
భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సెప్టెంబర్ 16న 1991–2020 సగటు కంటే 2.9 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. 1982లో ఉపగ్రహ కొలతలు ప్రారంభమైన తర్వాత ఆ తేదీన నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. గతంలో పూర్తయిన ఎల్‌నినో ఘటనల్లో 2015–16లో 3.01 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుత ఎల్‌నినో ఇంకా గరిష్ఠ స్థాయికి చేరలేదని అంచనాలు సూచిస్తున్నాయి. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో భారత రుతుపవనాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
దేశవ్యాప్తంగా లోటు వర్షపాతం
జూన్ 1 నుంచి సెప్టెంబర్ 17 వరకు దేశంలో 686.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో 806.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. 15 శాతం లోటు ఏర్పడింది. దేశంలోని 36 వాతావరణ ఉపవిభాగాల్లో 19 ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం లోటు నమోదైంది. రాయలసీమలో 51 శాతం, పంజాబ్‌లో 39 శాతం, మరాఠ్వాడాలో 38 శాతం, బీహార్‌లో 36 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ఈ ప్రాంతాలు వరి, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు కీలకమైనవి.


