Sunday, September 20, 2026
E-PAPER
Homeజాతీయంకాసుల్లేక కష్టాలు

కాసుల్లేక కష్టాలు

- Advertisement -

భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం
చమురు ధరల షాక్‌.. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఏఐతో ఉద్యోగాల కోతలు
మార్కెట్ల పతనం, రూపాయి క్షీణతతో పెరుగుతున్న ఆందోళనలు
మోడీ సర్కారు ఆర్థిక విధానాలపై ప్రశ్నలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో పెరుగుతున్న ముడిచమురు ధరలు, అమెరికా బాండ్లపై అధిక వడ్డీలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు.. భారత్‌ ఆర్థిక వ్యవస్థపై ముప్పేట ఒత్తిడిని పెంచుతున్నాయి. స్టాక్‌ మార్కెట్ల పతనం నుంచి రూపాయి విలువ క్షీణత, దిగుమతి వ్యయాల పెరుగుదల, ఉపాధి అవకాశాలపై ఆందోళనల వరకు.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలకు అంతర్జాతీయ పరిణామాలు కొత్త సవాళ్లు విసురుతున్నాయి.

న్యూఢిల్లీ : ముడిచమురు ధరలు బ్యారెల్‌కు వంద డాలర్లు దాటడం, అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం, విదేశీ పెట్టుబడుల భారీ ఉపసంహరణతో భారత స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సెప్టెంబర్‌ 15న ఒక్కరోజే సుమారు రూ.9.50 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మరోవైపు కృత్రిమ మేధ వినియోగం, వ్యయ నియంత్రణ పేరుతో బహుళజాతి టెక్నాలజీ సంస్థల్లో ఉద్యోగాల కోతలు భారత ఉపాధి రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్న భారత్‌కు ఈ పరిణామాలు ద్రవ్యోల్బణం, రూపాయి విలువ, ఆర్థిక వృద్ధిపై మరింత ఒత్తిడి పెంచే అవకాశముంది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది.

ఒక్కరోజే రూ.9.50 లక్షల కోట్ల సంపద ఆవిరి
ఈ నెల 15న భారత స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఒక్కరోజు మార్కెట్‌ పతనంతో సుమారు రూ.9.50 లక్షల కోట్ల సంపద తగ్గింది. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మూడు నెలల కనిష్ఠానికి చేరుకుని ఐదు ట్రిలియన్‌ డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రపంచ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో భారత్‌ వాటా జూన్‌ 3 తర్వాత కనిష్ఠ స్థాయికి చేరింది. నిఫ్టీ ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయింది.

చమురు మంట.. దిగుమతులపై భారం
భారత్‌ తన ముడిచమురు అవసరాల్లో 88 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో అంతర్జాతీయ చమురు ధరల్లో మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో బ్రెంట్‌ ముడిచమురు ధర బ్యారెల్‌కు సుమారు 108 డాలర్లకు చేరగా, సెప్టెంబర్‌ 14న భారత క్రూడ్‌ బాస్కెట్‌ ధర 128.70 డాలర్లుగా నమోదైనట్టు నివేదికలు పేర్కొన్నాయి. ముడిచమురు ధరలో ప్రతి డాలర్‌ పెరుగుదల భారత్‌ దిగుమతి బిల్లును సుమారు రూ.18,000 కోట్ల మేర పెంచవచ్చని నివేదిస్తున్నాయి. చమురు ధరలు ఎక్కువకాలం అధికంగా కొనసాగితే రవాణా, పరిశ్రమలు, విమానయానం, పెట్రోకెమికల్స్‌ వంటి రంగాల వ్యయాలు పెరగవచ్చు. ఇది వినియోగదారులపై ధరల భారాన్ని పెంచే అవకాశం ఉంది.

ఏఐ పేరుతో ఉద్యోగాల కోతలు
ఆర్థిక ఒత్తిళ్లకు తోడు టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు భారత ఉపాధి రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. క్లౌడ్‌ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధపై పెట్టుబడులు పెంచుతున్న ఒరాకిల్‌ సంస్థలో ఉద్యోగాల కోతలు చోటుచేసుకున్నాయి. భారత కార్యకలాపాల్లో సుమారు 2,500 నుంచి 4,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. భారత్‌లో సుమారు మూడువేల మంది ప్రభావితమయ్యే అవకాశం ఉందని నివేదికలు వివరించాయి. మే 31తో ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్‌ ప్రపంచవ్యాప్తంగా 21,000 మంది ఉద్యోగులను తగ్గించినట్టు బిజినెస్‌ ఇన్‌సైడర్‌ నివేదించింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో సుమారు 13 శాతానికి సమానం. అయితే సాంకేతిక అభివృద్ధి పేరుతో ఉద్యోగాల కోతలు చోటుచేసుకుంటే, నైపుణ్యవంతులైన ఉద్యోగులు, కుటుంబాల ఆదాయం, యువత ఉపాధి అవకాశాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.

మోడీ సర్కారుకు ఆర్థిక సవాళ్లు
దిగుమతి చమురుపై ఆధారపడటం, రూపాయి విలువలో మార్పులు, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఉపాధి కల్పన వంటి అంశాలు మోడీ ప్రభుత్వ విధానాలకు సవాలుగా నిలుస్తున్నాయి. మోడీ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం వంటి లక్ష్యాలను ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ముడిచమురు సరఫరాలో అంతరాయాలు కొనసాగితే దిగుమతి వ్యయం మరింత పెరగచ్చు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల నిర్ణయాలు, ప్రపంచ బాండ్‌ మార్కెట్ల పరిణామాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహాలు భారత ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

రూపాయిపై ఒత్తిడిడాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ వరుసగా ఐదో సెషన్‌లోనూ క్షీణించింది. సెప్టెంబర్‌ 15న డాలర్‌కు రూ.95.88 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా బాండ్లపై
రాబడులు పెరగడం, ముడిచమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. రూపాయి బలహీనపడితే చమురు వంటి దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

విదేశీ పెట్టుబడిదారుడుల ఉపసంహరణ
2026లో ఎక్కువ కాలం భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐలు) నికర విక్రయదారులుగా కొనసాగారు. సెప్టెంబర్‌ తొలి పది ట్రేడింగ్‌ సెషన్లలోనే సుమారు రూ.13,138 కోట్ల విలువైన భారత ఈక్విటీలను విక్రయించినట్టు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడుల నికర ఉపసంహరణ సుమారు రూ.2.37 లక్షల కోట్లకు చేరింది. ఆగస్టులో వచ్చిన రూ.29,631 కోట్ల పెట్టుబడుల్లో 44 శాతాన్ని సెప్టెంబర్‌ అమ్మకాలు తుడిచిపెట్టాయి. భారత షేర్ల విలువలు కంపెనీల ఆదాయాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయనే అంచనాలు, రూపాయి విలువ క్షీణత కారణంగా పెట్టుబడులపై తగ్గుతున్న రాబడులు, ప్రపంచ వడ్డీరేట్లపై ఆందోళనలు విదేశీ పెట్టుబడిదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -