వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక చేయాలి
విద్యార్థులకు నాణ్యమైన సామాగ్రి ఇవ్వాలి
సమీక్షా సమావేశంలో సీఎం ఏ రేవంత్రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ర్ట ప్రభుత్వం విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని చెప్పారు. శనివారంనాడాయన విద్యార్థులకు అందించే యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీ సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులుతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సబ్యసాచి ఘోష్, బాల మాయాదేవి, అహ్మద్ నదీమ్, దివ్య దేవరాజన్, నవీన్ నికోలస్, శ్రుతి ఓజా, సైదులు, సంతోష్, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భవంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్ పిల్లలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన వస్తువుల పంపిణీ వివరాలను అధికారులు సీఎంకు నివేదించారు. విద్యార్థులకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందనీ, రెండో జత యూనిఫాంను నెలాఖరులోగా అందజేస్తామని తెలిపారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేశామన్నారు.
విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు పంపిణీ పూర్తయిందని చెప్పారు. ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్ఫూన్లు, కప్పులు, కార్పెట్లు, బెడ్ షీట్లు, టవళ్లు పంపిణీ పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. ఆయా వివరాల పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, ఇతర సామగ్రి విద్యార్థులకు అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు అదనంగా 10 శాతం విద్యార్థులు పాఠశాలల్లో చేరే అవకాశం ఉన్నందున, అందుకు తగినట్లు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు వచ్చిన తక్షణం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది అనుకున్న లక్ష్యాల ప్రకారం పనిచేసిన అధికారుల్ని అభినందించారు.



