చెక్కును అందజేసిన ఎండీ నాగిరెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడి శాశ్వత అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి టీజీఎస్ఆర్టీసీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఆదుకున్నాయి. ఉచిత ప్రమాద బీమా పథకంలో భాగంగా బాధిత డ్రైవర్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాయి. కరీంనగర్ జిల్లా కోరుట్ల డిపోలో డ్రైవర్ గా పనిచేసే ఎండీ.మదార్ గత ఏడాది అక్టోబర్ తొమ్మిదో తేదీన విధి నిర్వహణలో ప్రమాద బారిన పడి కాలు కోల్పోయారు. ఇప్పటికే ఆ డ్రైవర్ యూబీఐ అందించే ‘సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్’ బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచింది. సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులందరూ యూబీఐ బ్రాంచీల్లో ఖాతాలు తెరిచి రూపే కార్డులు పొంది ఉండటంతో, ఈ ఖాతా ద్వారా లభించే ఉచిత ప్రమాద బీమా వర్తించింది.సోమవారం హైదరాబాద్ బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి, యూబీఐ సీజీఎం ఎం. రవీంద్రబాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్. సత్యనారాయణ బాబ్జిలతో కలిసి రూ. 50 లక్షల చెక్కును బాధిత డ్రైవర్ మదార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ తమ తప్పు లేకపోయినా రోడ్డు ప్రమాదాల బారిన పడి ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురికావడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ నిరంతరం ఉద్యోగుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు సంస్థ ఎల్లప్పుడూ ధైర్యంగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి బీమా పథకాలు అత్యవసర సమయాల్లో కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక భద్రతను ఇస్తాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ ప్రమాద బీమా పథకం ద్వారా 27 మంది ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సీహెచ్. వెంకన్న, ఎం. రాజశేఖర్, సాలమన్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప, సీపీఎం. ఉషాదేవితో పటు యూబీఐ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో అంగవైకల్యానికి గురైన డ్రైవర్‌కు రూ.50 లక్షల బీమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



